తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
● వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు ● అరెస్టు చేసిన పోలీసులు
ాకినాడ క్రైం: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాను కాకినాడ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ ఆ వివరాలు వెల్లడించారు. కాకినాడ పర్లోవపేటకు చెందిన 22 ఏళ్ల సుంకర తేజ పాత నేరస్తుడు. అదే ప్రాంతానికి చెందిన మోది కార్తిక్, కర్రి దుర్గాప్రసాద్, కర్రి నానితో కలిసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళాలు తెరవడంలో ఆరితేరిన ఈ బృందం ముందుగా కిటికీలు, చెప్పుల స్టాండ్‌లలో తాళం చెవి కోసం వెతుకుతారు. కనిపించకపోతే తలుపులు తెరిచి ఇళ్లు గుల్ల చేస్తారు. సుమారు ఏడాది కాలంగా నగరంలో ఈ ముఠా వరుస దొంగతనాలకు పాల్పడుతోంది. ఇలా కాకినాడ వన్ టౌన్, టూ టౌన్, పోర్టు, ఇంద్రపాలెం, కరప పోలీస్‌స్టేషన్ల పరిధిలో దోపిడీలకు పాల్పడ్డ ఈ ముఠా ఏడాది కాలంలో 331 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, కిలో వెండి సామగ్రిని దొంగిలించింది. సుమారు రూ.42.60 లక్షల విలువైన ఈ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు తాము చోరీ చేసిన సొత్తును పర్లోవపేటకు చెందిన సుంకర అచ్యుత వరప్రసాద్, బండి హారిక, ఇంద్రపాలేనికి చెందిన కటకం పద్మరాజు అనే వ్యక్తులకు విక్రయించి ఆ సొత్తుతో జల్సాలు చేశారు. దొంగిలించిన నేరంలో నలుగురిలో ముగ్గురిని, కొన్న నేరంలో ముగ్గురిలో ఇద్దరిని మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. కర్రి దుర్గాప్రసాద్, కటకం పద్మరాజు పరారీలో ఉన్నారు. ఎస్‌డీపీవో దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో కాకినాడ క్రైం సీఐ వి.కృష్ణ, పోర్టు, రూరల్ సీఐలు సునీల్ కుమార్, చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో క్రైం బృందాలు క్రియాశీలకంగా వ్యవహరించి కేసును ఛేదించాయని ఎస్పీ తెలిపారు.
దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏపీ రైతుకూలీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా స్థానిక యూటీఎఫ్ హోమ్‌లో శనివారం అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత బాలాజీ చెరువు సెంటర్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జెడ్పీ సెంటర్, కలెక్టరేట్ మీదుగా సభాస్థలి వరకు కార్మికులు, కర్షకులు ప్రజా సంఘాల శ్రేణులు ఎర్రజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ సమాజంలో ఒక మనిషిని మరో మనిషి, ఒక జాతిని మరో జాతి పీడించే సాంఘిక ధర్మం కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచె అంజిబాబు, అధ్యక్షులు మడకి సత్యం, ఉపాధ్యక్షులు నారాయణమూర్తి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవి పాల్గొన్నారు.


