విద్వాంసులకు చక్కని వ్యవస్థ అవసరం
రాజమహేంద్రవరం రూరల్: విద్వాంసులు ఒక ప్రాంతంలో ఉండాలంటే చక్కని వ్యవస్థ ఉండాలని, గురుకులం అటువంటి వ్యవస్థను అందించడం ఆనందదాయకమని మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. ప్రముఖ సాహితీవేత్తలు, వేద విద్వాంసులు, వేద శాస్త్రాభిమానులు రచించిన వ్యాసాలతో.. కొంతమూరులోని శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం వెలువరించిన ‘వేద పరిరక్షణం – సర్వ జగద్రక్షణం’ రజతోత్సవ స్మరణ సంచికను శనివారం ఆయన ఆవిష్కరించారు. తొలి ప్రతిని నగర ప్రముఖుడు దాట్ల బుచ్చి వెంకటరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ ప్రసంగించారు. గురుకులం కార్యదర్శి, భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, నగరంలో ఎక్కడ వేదస్వస్తి జరపాలన్నా గురుకులం విద్యార్థులు కావాలని కోరుతున్నారని అన్నారు. ఎందరో ఆచార్యులు, వేద విద్వాంసులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తల పాదస్పర్శతో పునీతమైన గురుకులం విశ్వవ్యాప్త ప్రాచుర్యాన్ని సంతరించుకున్నదని హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక ధార్వాడ్‌కు చెందిన ప్రముఖ వేద విద్వాంసుడు రాజేశ్వరశాస్త్రి జోషి, ప్రవచన రాజహంస ధూళిపాళ మహాదేవమణి, మహాహోపాధ్యాయులు శలాక రఘునాథశర్మ, దోర్భల ప్రభాకరశర్మ, గుళ్లపల్లి ఆంజనేయ ఘనపాఠి, కొంపెల్ల సత్యనారాయణశాస్త్రి, ప్రముఖ సాంస్కృతిక విద్వాంసుడు కందుకూరి రామసూర్యనారాయణ తదితరులు ప్రసంగించారు. రజతోత్సవాలను విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ వేద విద్యా గురుకులం వ్యవస్థాపకుడు, ప్రధానాచార్యుడు గుళ్లపల్లి సీతారామాంజనేయ ఘనపాఠి ధన్యవాదాలు తెలిపారు. సీతారామాంజనేయ ఘనపాఠి దంపతులకు ఆదివారం జరిగే షష్టిపూర్తి సత్కార సభతో రజతోత్సవాలు ముగియనున్నాయి.


