టూర్.. హుషార్
రాయవరం: చదువుతో పాటు ఆటపాటలు అవసరమని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ఆటపాటలే కాదు, విహారయాత్రలు కూడా విద్యార్థులకు చాలా అవసరం. అవి బుద్ధి వికాసానికి, విజ్ఞాన సముపార్జనకు ఉపయోగపడతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విహార యాత్రలకు ఈ ఏడాది కూడా విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. సమగ్ర శిక్షా ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.500 వంతున కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే పలు పాఠశాలలు తమ విద్యార్థులను విజ్ఞాన, విహార యాత్రలకు తీసుకుని వెళుతున్నాయి.
అవగాహన
తరగతి గదిలో నాలుగు గోడల మధ్య నేర్చుకునే అంశాలను ప్రత్యక్షంగా చూసి, అవగాహన పెంచుకోవాలనే లక్ష్యంతో సమగ్ర శిక్షా నిధులతో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులను విహార యాత్రలకు తీసుకువెళ్లేందుకు అనుమతినిచ్చారు. పాఠశాలలోని విద్యార్థుల్లో 8 శాతం మందికి నిధులు కేటాయించారు. నవంబర్ నెలాఖరులోపు ఈ విజ్ఞాన, విహార యాత్రలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల 20తో సమ్మేటివ్–1 పరీక్షలు ముగుస్తున్నందున, ఆ తర్వాత నుంచీ విహార యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పరీక్షల అనంతరం విద్యార్థులకు ఆటవిడుపుగానూ ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలోని పీఎంశ్రీ ఫేజ్–1, ఫేజ్–2కు చెందిన 77 పాఠశాలలను ఎక్స్‌పోజర్ విజిట్‌కు ఎంపిక చేశారు. వీటిలోని 8 శాతం మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఇలా ఆ 77 పాఠశాలలకు చెందిన 4.280 మంది విద్యార్థులకు రూ.21.40 లక్షలు పాఠశాలల ఖాతాలకు విడుదల చేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యాస్థాయి, ప్రతిభ, ఆసక్తి ఆధారంగా విహారయాత్రకు అవకాశం లభించనుంది. అలాగే విహారయాత్రకు తీసుకు వెళ్లాల్సిన ప్రాంతాలను రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారులు నిర్ణయించారు.
ఎంపిక చేసిన ప్రాంతాలివే
విద్యార్థులను విహార యాత్రలకు తీసుకువెళ్లడానికి ఈ కింది తెలిపిన ప్రదేశాలను ఎంపిక చేశారు. కాకినాడ పోర్టు, రాజమహేంద్రవరం రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి, ఓఎన్‌జీసీ, తాళ్లరేవు మండలం కోరంగి మడ అడవులు, పెద్దాపురంలోని పాండవుల మెట్ట, అడ్డతీగల వద్ద ఉన్న మెడిటేషన్‌న ప్లాంట్స్, ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట.
మార్గదర్శకాలు
● ముందస్తుగా మండల స్థాయి కమిటీని సంప్రదించి, వారితో చర్చించి విహారయాత్రకు తీసుకుని వెళ్లే తేదీని ఖరారు చేసుకోవాలి. సదరు విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా ఏపీసీకి తెలపాలి.
● విహార యాత్ర వాహనాల విషయంలో సాధ్యమైనంత వరకు ఆర్టీసీ సౌకర్యాలు వినియోగించుకోవాలి. ప్రథమ చికిత్సకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మాత్రమే విహారయాత్రకు విద్యార్థులను తీసుకు వెళ్లాలి.
● విద్యార్థులు, విద్యార్థినులకు తోడుగా పురుష, మహిళా ఉపాధ్యాయులను కూడా పంపించాలి. ప్రతి పది మంది విద్యార్థినులకు ఒక మహిళా టీచర్ తప్పనిసరిగా ఉండాలి.
● విద్యార్థులకు అందుబాటులో అన్ని వేళల్లో స్వచ్ఛమైన తాగునీరు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేసుకోవాలి.
● విహారయాత్ర పూర్తయిన వెంటనే అక్కడకు వెళ్లిన టీచర్లు, విద్యార్థుల వివరాలు, ఖర్చులు, ఫొటోల వివరాలతో డాక్యుమెంటేషన్‌ను డీఈవో/సమగ్ర శిక్షా కార్యాలయంలో సమర్పించాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది
విహార యాత్ర మధ్యలో విద్యార్థులు బస్సు దిగాల్సి వచ్చినప్పుడు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి. అందరూ బస్సు ఎక్కారా, లేదా అనే విషయాన్ని నిర్ధారించుకున్నాకే బస్సును ముందుకు కదపాలి. విహారయాత్రలో చూసిన విషయాలను ఒక పుస్తకంలో రాసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. నదులు, చెరువుల వద్ద ఈత కొట్టకుండా చూసుకోవాలి. పాఠశాల విద్యార్థులందరూ యూనిఫాంలో ఉంటే మంచిది. సెల్ఫీలు దిగేటప్పుడు పరిసరాలను తప్పనిసరిగా గమనించాలి.
ఎక్స్‌పోజర్ విజిట్‌కు పచ్చజెండా
ఈ నెల చివరిలో
విద్యార్థుల విహారయాత్రలు
ఉమ్మడి జిల్లాలో 4,280 మందికి
రూ.21.40 లక్షల విడుదల
టూర్.. హుషార్
టూర్.. హుషార్


