నిమ్మదించింది
యాదవోలు మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన నిమ్మకాయలు
నిమ్మ రైతు వెన్ను విరిగింది
మార్కెట్లో నిమ్మకాయల ధర పత నం కావడంతో నిమ్మ రైతుల వెన్ను విరిగింది. నాలుగు నెలలుగా నిమ్మ మార్కెట్ సంక్షోభంలో ఉంది. జూన్ నుంచి మార్కెట్ కోలుకోలేదు. అప్పట్లో కిలో నిమ్మకాయలు రూ.15 నుంచి రూ.20 పలికాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మూడు కాయలు రూ.10 పలుకుతూంటే రైతు వద్ద మాత్రం కిలో రూ.8 నుంచి రూ.10 మాత్రమే పలుకుతోంది. కౌలుదారులు కోలుకోవడం కష్టం. ఎకరాకు రూ.1.20 లక్షల నష్టం వస్తోంది.
– అనిశెట్టి సూర్యచంద్రం, నిమ్మ రైతు,
యాదవోలు, దేవరపల్లి మండలం
చెట్ల కిందనే వదిలేస్తున్నాం
బస్తా కాయలు అమ్మితే రూ.500 వస్తోంది. కోత కూలి రూ.700 అవుతోంది. కిలో రూ.8 ధర పలుకుతోంది. ఇంత దారుణం ఎప్పుడూ లేదు. కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో చెట్ల కిందనే కాయలు వదిలేస్తున్నాం. గత ప్రభుత్వంలో నిమ్మ సాగు లాభదాయకంగా ఉంది. కిలో రూ.100 పలికింది. ఏడాది పొడవునా కిలో ధర రూ.50కి తగ్గలేదు. 3.5 ఎకరాల నిమ్మ తోటకు రూ.5 లక్షల పెట్టుబడి పెట్టాను. తుపానుకు పూత, పిందె దెబ్బ తిన్నాయి. వేసవి పంటపై కూడా ఆశ లేదు.
– శ్రీరంగం వీరనాగు, నిమ్మ రైతు,
కొత్తగూడెం, దేవరపల్లి మండలం
అందుకే ధర పతనం
ఇతర ప్రాంతాల్లో నిమ్మ దిగుబడులు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ధర పతనమైంది. నిమ్మ వినియోగం తగ్గడం కూడా దీనికి తోడైంది. ఇంత తక్కువ ధర పలికిన పరిస్థితి 2019కి ముందు ఉండేది. మళ్లీ ఇప్పుడే చూస్తున్నాం. కౌలుదార్లు పారిపోయే పరిస్థితి. మార్కెట్‌కు రోజుకు 800 బస్తాలు వస్తున్నాయి. తొలకరి సీజన్‌లో ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుంది. గత ఏడాది శీతాకాలంలో కిలో ధర రూ.30 ఉంది. వేసవి సీజన్ పైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.
– సింగులూరి రామ్మోహనరావు, నిమ్మ రైతు,
యాదవోలు, దేవరపల్లి మండలం
యాదవోలు నిమ్మ మార్కెట్
దేవరపల్లి: నిమ్మ ధర పతనమైంది. మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ.8 పలుకుతున్నాయి. ప్రస్తుతం దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ధర లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. దీంతో, చాలా మంది రైతులు చెట్ల కిందనే నిమ్మ పండ్లు వదిలేస్తున్నారు. కొంత మంది చెట్ల కింద వదిలేయలేక మార్కెట్‌కు తీసుకు వెళుతున్నారు.
జిల్లావ్యాప్తంగా దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, రాజానగరం, కోరుకొండ, చాగల్లు తదితర మండలాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు. ఎక్కువగా కొవ్వూరు డివిజన్‌లోని దేవరపల్లి మండలం యాదవోలు, కొత్తగూడెం, ధుమంతునిగూడెం, చిన్నాయగూడెం; నల్లజర్ల మండలం పోతవరం, అయ్యవరం, కొత్తగూడెం, దూబచర్ల, కవులూరు ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు నిమ్మ పంట పండిస్తున్నారు. జిల్లాలో సుమారు 3,600 ఎకరాల్లో నిమ్మ తోటలున్నాయి.
సగానికి సగం నష్టం
బస్తా (50 కిలోలు) కాయలు కోయడానికి కూలీ ఖర్చు రూ.800 అవుతోంది. ఆ కాయలు మార్కెట్లో అమ్మితే రూ.400 మాత్రమే వస్తోంది. సగానికి సగం నష్టం వస్తూంటే నిమ్మ సాగు ఏవిధంగా చేయగలమని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎరువులు, కూలి ఖర్చులు, ఇతర పెట్టుబడులు రోజురోజుకూ పెరుగుతూండగా, పండించిన పంటకు మాత్రం ధర పడిపోతోందని వాపోతున్నారు. 2019–24 మధ్య నిమ్మ సాగు లాభదాయకంగా ఉంది. ఆ ఐదేళ్లూ మంచి ధర లభించడంతో రైతులు నాలుగు డబ్బులు వెనకేసుకున్నారు. ప్రస్తుతం ఏడాది నుంచి నిమ్మ ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కిలో నిమ్మకాయల ధర రూ.80 నుంచి రూ.100 వరకూ పలికింది. గత ఏడాది రూ.20 నుంచి రూ.35 మాత్రమే లభించింది. ఒక్కసారిగా ధర పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం అది మరీ దారుణంగా రూ.8కి పడిపోయింది. సాధారణంగా ఏటా వర్షాకాలంలో నిమ్మకాయలకు డిమాండ్ తక్కువగా ఉంటుంది. వేసవిలో పెరుగుతుంది. దసరా నుంచి మార్కెట్ ఊపందుకుని మార్కెట్లో ధర పెరుగుతుంది. ఈ ఏడాది అటువంటి పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు.
కౌలు రైతులకు కష్టమే..
నిమ్మ తోటలు సాగు చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది కౌలుదార్లున్నారు. వీరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కొక్కరు 3 నుంచి 5 ఎకరాలు కౌలుకు తీసుకుని తోటలు సాగు చేస్తున్నారు. ఎకరం కౌలు రూ.1.20 లక్షలు కాగా, పెట్టుబడి మరో రూ.60 వేలు అవుతోంది. ఇతర ఖర్చులు కూడా కలిపితే ఎకరాకు సుమారు రూ.3 లక్షల వరకూ పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. సొంత భూములున్న రైతులకే ఎకరాకు రూ.1.20 లక్షల నష్టం వస్తోందని, తమకు కోత కూలి డబ్బులు కూడా రావడం లేదని కౌలుదార్లు ఆవేదన చెందున్నారు.
పడిపోయిన దిగుబడులు
ప్రస్తుతం నిమ్మ దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సాధారణంగా తొలకరి సీజన్‌లో ఎకరాకు 30 నుంచి 40 బస్తాల నిమ్మకాయల దిగుబడి రావాలి. కానీ, ప్రస్తుతం ఎకరాకు 15 నుంచి 20 బస్తాలు మాత్రమే వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. మోంథా తుపాను ప్రభావంతో తోటల్లో పూత, పిందె దెబ్బ తినగా, గాలుల తీవ్రతకు చెట్లు కదిలిపోయాయి.
50 టన్నుల కాయలు విక్రయం
యాదవోలు మార్కెట్లో సాధారణంగా రోజుకు 60 నుంచి 70 టన్నుల వరకూ నిమ్మకాయల విక్రయాలు జరుగుతూంటాయి. ప్రస్తుతం అది దాదాపు 50 టన్నులకు తగ్గిపోయింది. యాదవోలు పరిసర 10 గ్రామాల నుంచి రైతులు మార్కెట్‌కు నిమ్మకాయలు తీసుకు వచ్చి విక్రయిస్తూంటారు. రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ తర్వాత యాదవోలు నిమ్మ మార్కెట్‌కు గుర్తింపు ఉంది. ఇక్కడ రైతులే వ్యాపారులుగా మారి మార్కెట్లో కాయలు కొనుగోలు చేసి కోల్‌కతా, ఒడిశా, విశాఖపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూంటారు. రైతుల నుంచి ఎటువంటి కమీషన్ తీసుకోరు. ఒక్క యాదవోలు గ్రామంలోనే దాదాపు 250 మంది రైతులు సుమారు 1,200 ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నట్టు సమాచారం.
పతనమైన ధర కిలో రూ.8
దిగుబడులూ అంతంత మాత్రమే..
నిలిచిన ఎగుమతులు
కోత ఖర్చులు కూడా రాని దుస్థితి
నిరాశ చెందుతున్న రైతులు
నిమ్మదించింది
నిమ్మదించింది
నిమ్మదించింది
నిమ్మదించింది
నిమ్మదించింది
నిమ్మదించింది


