రత్నగిరి..జనసంద్రం
● సత్యదేవుని దర్శనానికి
లక్ష మందికి పైగా రాక
● రికార్డు స్థాయిలో
11,650 వ్రతాల నిర్వహణ
● రూ.1.20 కోట్ల ఆదాయం
అన్నవరం: కార్తిక బహుళ ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం రత్నగిరి భక్తజనసంద్రమే అయ్యింది. సత్యదేవుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకూ ఇసుకేస్తే రాలని విధంగా భక్తులు వచ్చారు. కార్తిక పౌర్ణమి నాడు సుమారు లక్ష మంది సత్యదేవుని దర్శించగా ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ 1.20 లక్షల మంది తరలివచ్చారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని, స్వామివారి ఆలయాన్ని శనివారం వేకువజామునే తెరచి, పూజలు చేశారు. అనంతరం వ్రతాలు ప్రారంభించారు. అప్పటి నుంచే సత్యదేవుని దర్శనాలకు కూడా భక్తులను అనుమతించారు. రద్దీ కారణంగా అంతరాలయ, యంత్రాలయ దర్శనాలు నిలిపివేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.1.20 కోట్ల ఆదాయం సమకూరింది. వ్రతాల ద్వారా రూ.65 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.40 లక్షలు, మిగిలిన విభాగాల ద్వారా రూ.15 లక్షలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఏకాదశి సందర్భంగా సత్యదేవునికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ కుంకుమార్చన నిర్వహించారు.
జోరుగా వ్రతాలు
ఈ కార్తికంలో ఇప్పటి వరకూ ఈ నెల 5న పౌర్ణమి నాడు జరిగిన 9,248 వ్రతాలు మాత్రమే అత్యధికం. ఆ రికార్డును అధిగమిస్తూ శనివారం 11,650 వ్రతాలు జరిగాయి. ఈ వ్రతాల్లో రూ.300 టిక్కెట్టువి 8,182, రూ.వెయ్యి వ్రతాలు 1,307, రూ.1,500 వ్రతాలు 969, రూ.2 వేల టిక్కెట్టు వ్రతాలు 969, ఆన్‌లైన్‌వి 436 ఉన్నాయి. వీటితో కలిపి కార్తికంలో ఇప్పటి వరకూ 1,15,086 వ్రతాలు జరిగాయి. గత ఏడాది కార్తికంలో ఇదే సమయానికి 1,25,544 వ్రతాలు జరగగా, ఈ ఏడాది ఇంకా 10,458 వ్రతాలు తక్కువగా ఉన్నాయి.
భక్తులకు తప్పని ఇక్కట్లు
● దేవస్థానం అధికారులు అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ వెల్లువలా తరలి వచ్చిన భక్తులకు అవి సరిపోక ఇక్కట్లు పడ్డారు.
● కొండ దిగువ నుంచి రత్నగిరికి, కొండ పైనుంచి దిగువకు తగినన్ని బస్సులు లేక గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
● ఉచిత బస్సులు ఉండటంతో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండ దిగువ నుంచి రత్నగిరికి తగినన్ని బస్సులు లేకపోవడంతో పలువురు ఆటో లను ఆశ్రయించారు. ఒక్కొక్కరి నుంచి ఆటోకు రూ.20 నుంచి రూ.30 వరకూ వసూలు చేశారు.
● రూ.1,500, రూ.2 వేల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు వ్రతాల నిర్వహణకు గంటల తరబడి పడిగాపులు పడ్డారు.
● రూ.1,500 వ్రతాలు అనివేటి మండపంలో (ధ్వజస్తంభం వద్ద) మాత్రమే చేస్తారు. అక్కడ రెండు బ్యాచ్‌లలో ఏకకాలంలో 200కు మించి వ్రతాలాచరించే వీలు లేదు. ఈ నేపథ్యంలో వీరి కోసం స్వామివారి ఆలయం వెనుక, ఉత్తరం వైపున షామియానాలతో తాత్కాలికంగా రెండు మండపాలు ఏర్పాటు చేసినా, వాటిలో వ్రతాలు ఆచరించేందుకు భక్తులు మొగ్గు చూపలేదు. అవి వృథాగా మిగిలిపోయాయి.
● రూ.2 వేల వ్రత మండపాలు కూడా చాలక భక్తులు ఇబ్బంది పడ్డారు. వ్రతాల టిక్కెట్లతో గంటల తరబడి వేచియుండాల్సి వచ్చింది.
● క్యూలో గంటల తరబడి నిలబడాల్సి రావడంతో చిన్న పిల్లలతో వచ్చిన వారి వేదన వర్ణనాతీతం. చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. కానీ, ఎవ్వరికీ ఒక్క బిస్కె ట్ ప్యాకెట్, పాలు పంపిణీ చేసిన దాఖలాల్లేవు.


