గుండెల్లో గుబేళ్లు
దేవరపల్లి: పొగాకు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పులు చేసి, శిస్తులు కట్టి సాగు చేసిన పంటకు సరైన ధర రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. లోగ్రేడ్ పొగాకు అమ్ముడుపోక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన కాడికి సరి పెట్టుకుని ఏదో ధరకు అమ్ముకుందామన్నా కొనే నాథుడు దొరకడం లేదు. మార్కెట్లో లోగ్రేడు పొగాకు అమ్ముడు పోక అధికారులు, రైతులు అయోమయంలో పడ్డారు. దాదాపు 20 రోజుల నుంచి వేలం కేంద్రాల్లో ఈ పొగాకు అమ్మకాలు జరుగుతున్నాయి. బ్రైట్, మీడియం గ్రేడు పొగాకును కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు.. లోగ్రేడు పొగాకు కొనుగోలుకు ససేమిరా అంటున్నారు. తక్కువ ధరకు ఇచ్చినా మా కొద్దు బాబోయ్ అని ట్రేడర్లు చేతులెత్తేయడంతో మార్కెట్లో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది.
ముగింపు దశకు అమ్మకాలు
బొగులు మాడు, సైలెన్, బాడవ భూముల్లో పండించిన లోగ్రేడు పొగాకు రైతుల ఇళ్ల వద్ద ఎక్కడకక్కడే ఉండిపోయింది. 2024–25 పంట కాలంలో పండించిన పొగాకు అమ్మకాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బోర్డు పరిమితి మేరకు పండించిన పొగాకు అమ్మకాలు పూర్తి కాగా, అదనంగా పండిన పంటను రైతులు వేలం కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. అదనపు పొగాకు అమ్మకాలు కూడా ముగింపు దశకు చేరుకోగా, లోగ్రేడు పొగాకు అమ్మకాలు పెద్ద సమస్యగా మారాయి. మొన్నటి వరకూ లోగ్రేడు కిలో ధర రూ.80 పలకగా, కొనుగోలు దారులు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం రూ.59 నుంచి 60కి పడిపోయింది. అంటే కిలోకు సుమారు రూ.20 పతనమైనప్పటికీ కోనుగోలుదారులు నిరాకరిస్తున్నారు. చిన్న కంపెనీలు కూడా దీన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
అధికారుల సన్నాహాలు
దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో ఈ నెలాఖరుకు పొగాకు వేలం ప్రక్రియను ముగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తర తేలిక నేలల (ఎన్‌ఎల్‌ఎస్) ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో దాదాపు 84 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యింది. దీనిలో 4 మిలియన్ల కిలోలు లోగ్రేడు పొగాకు ఉత్పత్తి జరిగినట్టు అధికారులు లెక్కలు వేశారు. ఒక్కొక్క వేలం కేంద్రంలో 5 నుంచి 7 లక్షల కిలోల లోగ్రేడు పొగాకు ఉత్పత్తి అయినట్టు సమాచారం. గత రెండేళ్లుగా లోగ్రేడుకు మంచి ధర లభించింది. కిలో రూ.120 నుంచి రూ.170 వరకూ పలికింది. లోగ్రేడు పొగాకు అమ్మకాలు పూర్తయితే రైతుల వద్ద గల సూర కొనుగోళ్లు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజులు సూర పొగాకు కొనుగోళ్లు ఉంటాయని చెబుతున్నారు.
అమ్ముడుపోని లోగ్రేడు పొగాకు బేళ్లు
ఆందోళనలో రైతులు
అయోమయంలో అధికారులు
ధర తగ్గించినా ముందుకు రాని ట్రేడర్లు
4 మిలియన్ల లోగ్రేడు ఉత్పత్తి


