కుక్కపిల్లకు గండం గడిచింది
● సూదిని మింగేసిన వైనం
● రెండు గంటలు సర్జరీ చేసిన పశువైద్యులు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): దారంతో ఉన్న సూదిని మింగేసిన కుక్కపిల్లకు పశు వైద్యులు ప్రాణం పోశారు. దాదాపు రెండు గంటల పాటు సర్జరీ చేసి సూదిని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన గాజుల వెంకటేశ్వరరావు ఇంట్లో ఎనిమిది నెలల సిజ్జు జాతి కుక్కపిల్ల ఉంది. అది శుక్రవారం రాత్రి చేతి కుట్లు వేసే సూదిని దారంతో కలిపి మింగేసింది. దీంతో యజమాని ఆ కుక్కపిల్లను శనివారం రాజమహేంద్రవరం ఏరియా పశువైద్యశాలకు తీసుకువచ్చారు. ప్రభుత్వ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ కల్లూరి సత్యనారాయణ, వైద్యుడు డాక్టర్ రాజశేఖర్ రెండు గంటల పాటు సర్జరీ చేసి దారంతో ఉన్న సూది తొలగించారు. ప్రస్తుతం కుక్కపిల్ల ఆరోగ్యంగా ఉంది.
కుక్కపిల్లకు గండం గడిచింది


