అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం
● క్లస్టర్ అభివృద్ధి,
పారిశ్రామిక రాయితీలపై దృష్టి
● అధికారులతో కలెక్టర్ కీర్తి
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో ప్రాథమిక రంగానికి అనుబంధ పరిశ్రమలను స్థాపించే దిశగా అధికారులు ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, డెయిరీ, పాల ఉత్పత్తుల పరిశ్రమలకు పశుసంవర్ధక శాఖ, చేపల సీడ్స్, ఫీడ్ ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు మత్స్యశాఖ ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో రూ.15 కోట్ల అంచనాతో ఫర్నిచర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేసి, ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రాజానగరం మండలం కలవచర్లలోని ఎంఎస్‌ఎంఈ పార్కులో గ్రాఫైట్, బంకమట్టితో క్రూసిబుల్స్ తయారీ పరిశ్రమతో పాటు సిరామిక్ క్లస్టర్ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని ఏపీఐఐసీ ద్వారా కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా గత జూలై నుంచి అక్టోబర్ వరకు వివిధ శాఖల పరిధిలో 3,246 దరఖాస్తులు రాగా, వాటిలో 3,174 దరఖాస్తులను ఆమోదించామని, 71 పెండింగ్‌లో ఉండగా, ఒక్క దరఖాస్తును తిరస్కరించినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం అల్యూమినియం వర్కర్స్ కాలనీలో అల్యూమినియం సర్కిల్స్, పాత్రల తయారీ కోసం గోదావరి రోలింగ్స్ అసోసియేషన్ క్లస్టర్ ఏర్పాటు చేసుకోవటానికి కమిటీ అనుమతి మంజూరు చేసిందన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి వి.రామన్, ఏపీ ఈఈసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ బి.పద్మజా దేవి, డీఆర్డీఏ పీడీ ఎన్‌వీఎస్‌ఎస్ మూర్తి, జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి తదితరులు పాల్గొన్నారు.


