హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి నర్సింగరావు
● పెద్దాపురంలో జిల్లా
మహాసభలు ప్రారంభం
పెద్దాపురం (సామర్లకోట): కేంద్రం, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. పెద్దాపురంలో శనివారం ప్రారంభమైన సీఐటీయూ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు యాసలపు సూర్యారావు భవనంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ జెండాను ఆవిష్కరించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి, అమర వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయని, అంతర్జాతీయంగా చమురు రేట్లు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోలు, డిజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలపై భారం విపరీతంగా పడిందన్నారు. కార్పొరేట్ సంస్థల లాభాలపై పన్ను రేటును 33 నుంచి 20 శాతానికి తగ్గించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందన్నారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులను అదానీకి మోదీ అప్పగించారన్నారు. మహాసభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


