అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: కార్తిక మాసంలో తొలి శనివారం సందర్భంగా అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే కోనేరులో భక్తులు కార్తిక దీపాలు వదిలారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్‌లో దాదాపు రెండు గంటల పాట నిలబడి స్వామిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. సుమారు వంద మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దాతల ఆర్థిక సాయంతో 12 వేల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో అన్నసమారాధన, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామన్నారు.
తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం(సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువైన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం కావడంతో జిల్లా నలుమూలల నుంచీ అనేక మంది కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. సుమారు 18 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,51,570, అన్నదాన విరాళాలకు రూ.67,918, కేశ ఖండన ద్వారా రూ.2,360 తులాభారం ద్వారా రూ.250, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.12,735లతో మొత్తం రూ.2,34,833 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశామన్నారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.
కమీషన్ పెంచకపోతే షాపులు మూసేస్తాం
అమలాపురం టౌన్: ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన మద్యం షాపులకు మొదట్లో గెజిట్‌లో పేర్కొన్నట్లు 20 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని జిల్లాలోని మద్యం షాపుల యజమానులు డిమాండ్ చేశారు. తమకు 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే వ్యాపారాలు చేయలేమని వారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమలాపురం బ్యాంక్ స్ట్రీట్‌లో డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయం ఎదురుగా ఉన్న మిడ్ టౌన్ అపార్ట్‌మెంట్స్‌లో మద్యం షాపుల యజమానులు శనివారం సమావేశమయ్యారు. తమకు కమీషన్ పెంచకపోతే షాపులను మూసివేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 13.5 శాతం కమీషన్ ఎంత మాత్రం సరిపోవడం లేదని తెగేసి చెప్పారు. జిల్లా వైన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అత్యవర సమావేశానికి దాదాపు 150 మంది మద్యం షాపుల యజమానులు పాల్గొని ప్రభుత్వానికి తమ అసహనాన్ని, నిరసనను తెలియజేశారు. 2024–26 మద్యం పాటదారులైన లైసెన్స్ షాపుల యజమానులు మూకుమ్మడిగా తమ గళాన్ని అటు జిల్లా ఎకై ్సజ్ అధికారులకు, ఇటు ప్రభుత్వానికి వినిపించారు. అలాగే గెజిట్లో లేని పర్మిట్ రూమ్‌ల కోసం వసూలు చేస్తున్న రూ.7.5 లక్షలను వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రానున్న 15 రోజుల్లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ అధికారులకు జిల్లా వైన్ షాపుల అసోసియేషన్ తరఫున వినతిపత్రం అందించారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, మద్యం షాపుల లైసెన్స్‌దారులు తాడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ


