జగన్‌ ప్రభుత్వంలోనే డేటా సెంటర్‌కు ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ ప్రభుత్వంలోనే డేటా సెంటర్‌కు ఒప్పందం

Oct 26 2025 12:43 PM | Updated on Oct 26 2025 12:43 PM

జగన్‌

జగన్‌ ప్రభుత్వంలోనే డేటా సెంటర్‌కు ఒప్పందం

రాజమహేంద్రవరం సిటీ: జగన్‌ ప్రభుత్వంలోనే విశాఖపట్నంలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం కుదిరిందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ నగర అధ్యక్షుడు మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు అదానీ పేరు చెప్పకుండా, విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ తీసుకువచ్చామని ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

బాబుకు ప్రచార పిచ్చి

భరత్‌రామ్‌ మాట్లాడుతూ చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో ముఖ్యమంత్రి అయ్యారని, సత్య నాదేళ్ల మైక్రోసాఫ్ట్‌లో 1992లో చేరారన్నారు. కానీ చంద్రబాబు తానే హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ తీసుకువచ్చానని చెబుతున్నారన్నారు. సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌ డేటా సెంచర్‌ గురించి ప్రధానితో మాట్లాడానని చెబితే, అది కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఆదానీ కంపెనీ విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు పునాదులు పడ్డాయన్నారు. సబ్‌ సీ కేబుల్‌ ఏర్పాటుకు సింగపూర్‌ ప్రభుత్వంతో ఆ రోజే చర్చించడం జరిగిందన్నారు. ఆదానీ, ఎయిర్‌ టెల్‌, గూగుల్‌ సంయుక్తంగా డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సుందర్‌ పిచాయ్‌ చెప్పారన్నారు.

వైఎస్సార్‌ సీపీ నాయకులకు వేధింపులు

కర్నూలు వద్ద దహనమైన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సుకు ఏడాదిన్నరగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేదని, సుమారు 16 చలాన్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయని భరత్‌ అన్నారు. రాజమహేంద్రవరం హాస్టల్లో పదో తరగతి చదువుతున్న బాలికను దీపావళి రోజున హాస్టల్‌ నుంచి తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు లైంగికంగా లోబర్చుకుంటే పోలీసులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టారన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని ధర్నా చేసిన తమపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపిన వైఎస్సార్‌ సీపీ నాయకురాలు అనూ యాదవ్‌ను అరెస్టు చేసి, మూడు గంటల పాటు నిర్బంధించారన్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలకు ఏరులై పారుతున్న మద్యమే కారణమని, 24 గంటలూ ఆ దుకాణాలు తెరిచే ఉంటున్నాయని భరత్‌రామ్‌ అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్న పేకాట క్లబ్‌లపై డిప్యూటీ సీఎం వపన్‌ కల్యాణ్‌ విచారణకు ఆదేశిస్తే, డిప్యూటీ స్పీకర్‌.. గోదావరి జిల్లాల్లో పేకాట సహజం అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాజమహేంద్రవరంలో పేకాట క్లబ్బులు ఇసుక, మద్యం, భూ సెటిల్‌మెంట్లు, స్పా సెంటర్లు అన్నీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు అండదండలతో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న చేపట్టనున్న ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులతో కలిసి భరత్‌ రామ్‌ ఆవిష్కరించారు.

సబ్‌ సీకేబుల్‌ ఏర్పాటుకు

సింగపూర్‌తో చర్చలు

ఆ విషయాన్ని ప్రస్తావించని

చంద్రబాబు, లోకేష్‌

అంతా తామే చేశామంటూ

అబద్ధపు ప్రచారం

మెడికల్‌ కాలేజీల

ప్రైవేటీకరణకు వ్యతిరేకిద్దాం

విలేకరుల సమావేశంలో

మాజీ ఎంపీ భరత్‌రామ్‌

జగన్‌ ప్రభుత్వంలోనే డేటా సెంటర్‌కు ఒప్పందం1
1/1

జగన్‌ ప్రభుత్వంలోనే డేటా సెంటర్‌కు ఒప్పందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement