అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
నిడదవోలు రూరల్: పోలీసునని చెప్పి బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్న అంతర్ జిల్లా దొంగను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ నిడదవోలు మండలం శంకరాపురంలో ఈ నెల 6న కోలా నాగేశ్వరరావుకు చెందిన బంగారు ఉంగరం, 22న కాయల మంగకు చెందిన బంగారపు బొందును ఓ వ్యక్తి చోరీ చేశాడు. వీరిని బెదిరించి బంగారం దోచుకుపోయాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయగా, విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఆదిరెడ్డి అప్పారావును నిందితుడిగా గుర్తించామని ఎస్సై తెలిపారు. గోపవరం వద్ద అప్పారావును అరెస్ట్ చేసి మూడు బంగారు ఉంగరాలు, రెండు కాసుల బొందు, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 పాత కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్సై బాలాజీ సుందరరావు, ట్రైనీ ఎస్సై జె.కల్పన, పోలీసులు జి.రామారావు, రాంబాబు, ధనుంజయ్‌లను ఎస్పీ డి.నరసింహకిశోర్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ అభినందించారు.


