అవిశ్రాంత సేవకులు
● సహచరులకు భరోసాగా
విశ్రాంత ఉద్యోగ సంఘం
● ‘మనం– మనకోసం’ పేరుతో అండగా..
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): వారంతా విశ్రాంత ఉద్యోగులు.. ఓ సదుద్దేశంతో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రెక్కలొచ్చిన కన్నబిడ్డలు ఉద్యోగాల పేరుతో దేశ విదేశాల్లో ఉండగా తమ సంఘ సభ్యులే కుటుంబీకులుగా సేవలందిస్తున్నారు. 1975లో ఐఏఎస్‌లు ఇ.వివేకానందమూర్తి, మొహిబుల్లా షరీఫ్, ఆదికేశవ నాయుడు కలసి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘాన్ని స్థాపించారు. తర్వాత సంఘ నాయకులు ఇస్మాయిల్, వడ్డమాని రామకృష్ణారావు, సలీముద్దీన్, ఎ.కనకారావు, అల్హజ్, కె.దుర్రాని బాధ్యత తీసుకున్నారు. వీరి హయాంలో కాకినాడ టౌన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూనిట్లుగా సంఘ కార్యకలాపాలు సాగేవి. అప్పటి రాష్ట్ర సంఘం ఆదేశాలతో కాకినాడ యూనిట్ తూర్పుగోదావరిగా పేరు మార్చుకుని సంఘ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2013లో జిల్లా అధ్యక్షుడిగా పీఎస్‌ఎస్‌ఎన్‌పీ శాస్త్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్యదర్శి ఎస్.ఇబ్రహీం, కోశాధికారి ఎన్.వెంకటరావుతో కలసి సంఘాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కె.పద్మనాభం అధ్యక్షుడిగా, టి.నూకరాజు సాధారణ కార్యదర్శిగా, వి.శేషగిరి కోశాధికారిగా కొనసాగుతున్నారు. జిల్లాలు విడిపోవడంతో ప్రస్తుతం కాకినాడ జిల్లా శాఖకు కాకినాడ, టౌన్ పోలీస్, ఏపీఎస్పీ పోలీస్, కరప, తాళ్లరేవు, పిఠాపురం, ప్రత్తిపాడు, ఎకై ్సజ్ ఫారెస్టు, రెవెన్యూ, ఏలేశ్వరం యూనిట్లు ఉన్నాయి. సంఘంలో ప్రస్తుతం నాలుగు వేల మంది సభ్యులకు పైబడి ఉన్నారు.
సంఘానికి భవన నిర్మాణం
కాకినాడలో శిథిలమైన సంఘ భవనం స్థానంలో కొత్త భవనాన్ని 2007లో అప్పటి కలెక్టర్ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ ఇచ్చిన రూ.10 లక్షలతో నిర్మించారు. కొత్త భవనంపై అంతస్తుకు మాజీ ఎంపీ పళ్లంరాజు రూ.2.5 లక్షలు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రూ.4 లక్షలు అందించగా, మిగిలినది సభ్యుల నుంచి వడ్డీలేని అప్పుగా తీసుకుని 150 మందికి సరపడా సమావేశ మందిరాన్ని, మూడు విశ్రాంత గదులను ఏర్పాటు చేసుకున్నారు.
సేవ చేస్తూ.. అండగా ఉంటూ..
పీఎస్‌ఎస్‌ఎన్‌పీ శాస్త్రి ఆలోచనలతో మనం–మనకోసం అనే సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా ఐదో తేదీన పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన సభ్యుల కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కోవిడ్ సమయంతో ప్రభుత్వంతో కలసి సభ్యులందరికీ వ్యాక్సినేషన్ చేయించారు. అవసరమైన సభ్యులకు పెన్షన్ పే స్లిప్ ఇస్తున్నారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. వివిధ పండగలు, టీచర్స్ డే, వుమెన్స్ డే, యోగా డేలను నిర్వహిస్తూ సభ్యుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. కాకినాడలో ఈ నెల 26న సంఘ గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించడానికి సిద్ధం చేశారు.
వేడుకలకు రండి
బోట్‌క్లబ్: స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలోని పెన్షన్ భవనంలో ఈ నెల 26న ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బ్రాంచ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి స్థానిక పింఛనుదారుల భవనంలో జిల్లా అధ్యక్షుడు కె.పద్మనాభం, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పీఎస్‌ఎస్ శాస్త్రిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 2026 జనవరి, ఫిబ్రవరిలో సభ్యులకు లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. వేడుకలకు పింఛనుదారులు కుటుంబ సభ్యులతో హాజరు కావాలని కోరారు. జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి టి.నూకరాజు, రాష్ట్ర సంఘం కార్యదర్శి షేక్ ఇబ్రహీం, అసోసియేషన్ల ప్రెసిడెంట్లు ఎన్.వెంకట్రావు, సరోజిని, జిల్లా సంఘ కోశాధికారి వి.శేషగిరి, రాష్ట్ర కార్యదర్శి షాజిదా పాల్గొన్నారు.
గోల్డెన్ జూబ్లీ చేసుకోవడం ఆనందం
ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పడి 50 ఏళ్లు పూర్తి కావడం ఆనందంగా ఉంది. 26న గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకుంటాం. ఈ యాభై ఏళ్లలో సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహించడం సంతృప్తి ఇచ్చింది.
– కె.పద్మనాభం, ఏపీఆర్‌జీఈఏ
జిల్లా అధ్యక్షుడు
ప్రతి కుటుంబానికీ అండ
మనం–మనకోసం అనే సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక సభ్యత్వం పొందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి సాయం అందిస్తున్నాం. ఇది సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటుంది.
– సీఎస్‌ఎస్‌ఎన్‌పీ శాస్త్రి, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు
అవిశ్రాంత సేవకులు
అవిశ్రాంత సేవకులు


