తెలుగు విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం | - | Sakshi
Sakshi News home page

తెలుగు విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం

Oct 24 2025 7:38 AM | Updated on Oct 24 2025 7:38 AM

తెలుగు విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం

తెలుగు విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం

రాజమహేంద్రవరం రూరల్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి కృషి చేస్తానని నూతన ఉప కులపతి (వైస్‌ చాన్సలర్‌ – వీసీ) ఆచార్య డి.మునిరత్నం నాయుడు అన్నారు. బొమ్మూరులోని విశ్వ విద్యాలయంలో ఆయన వీసీగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని కోర్సులూ వచ్చేలా చూస్తానని చెప్పారు. తమిళ విశ్వ విద్యాలయాన్ని చూసి, మనకు కూడా అటువంటిది ఉండాలనే ఆకాంక్షతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు విశ్వ విద్యాలయం నెలకొల్పారని అన్నారు. హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రం, శ్రీశైలంలో చరిత్ర తదితర అంశాలతో పీఠం, రాజమహేంద్రవరంలో సాహిత్య పీఠం, వరంగల్‌లో గిరిజన అంశాలకు సంబంధించిన పీఠం పెట్టారని, 1989లోనే సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని తెలుగు విశ్వ విద్యాలయంలో విలీనం చేశారని వివరించారు. వర్సిటీ మొదటి వీసీగా ఉన్న ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతిని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆచార్య మునిరత్నం నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రం ఉండిపోవడం, ఆస్తుల పంపకం చేయకపోవడంతో తెలుగు విశ్వవిద్యాలయం ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు. నిధుల కొరతను అధిగమించి, విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. సాహిత్య పీఠంలో ప్రస్తుతం ఉన్న కోర్సులతో పాటు హైదరాబాద్‌ ఉన్న అన్ని శాఖలనూ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జోతిషం, చిత్రలేఖనం, పాత్రికేయం తదితర అన్ని కోర్సులూ ఉండేలా చూస్తానని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని తెలుగు సంస్థలతో విశ్వ విద్యాలయం అనుబంధం కలిగి ఉందని, విదేశాల్లోని తెలుగు సంస్థలతో సైతం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఈ ఒప్పందాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. అమెరికాలో సిలికానాంధ్ర చొరవతో ఏటా 10 వేల మంది తెలుగు చదువుతున్నారని, ఇప్పటికి 1.20 లక్షల మంది చదువుకున్నారని తెలిపారు. మలేషియా, సింగపూర్‌లో కూడా తెలుగు బోధన నడుస్తోందని చెప్పారు. సంగీత , నృత్య పాఠశాలలన్నీ తెలుగు విశ్వవిద్యాలయ పరిధిలోకి వస్తాయని, తామే పరీక్షలు నిర్వహిస్తామని ఆచార్య మునిరత్నం నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, తెలుగు విశ్వ విద్యాలయం మౌలిక సదుపాయాల కోసం రూ.50 లక్షలు సమకూరుస్తామని చెప్పారు. సరిహద్దులు తేల్చి, ప్రహరీ నిర్మించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన తెలుగు చరిత్రకారుడు డేనియల్‌ నాదర్స్‌, శ్రీశైలం ప్రాంగణం పీఠాధిపతి ముసుగు శ్రీనివాసరావు, తెలుగు విశ్వ విద్యాలయం ఓఎస్‌డీ వి.నిరీక్షణబాబు, ప్రముఖ కవి, కళారత్న బిక్కి కృష్ణ, నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్‌, విజయ శంకర సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపాల్‌ పసుమర్తి శ్రీనివాసశర్మ, కూచిపూడి ప్రిన్సిపాల్‌ చింతా రవిబాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య మునిరత్నం నాయుడును పలువురు సన్మానించి, అభినందనలు తెలిపారు.

ఫ హైదరాబాద్‌లో ఉన్న

అన్ని శాఖలూ రప్పిస్తా..

ఫ వచ్చే విద్యా సంవత్సరానికి

పూర్తి స్థాయి కోర్సులు

ఫ విదేశాల్లోని తెలుగు సంస్థలతో

ఒప్పందాలు విస్తృతం

ఫ నూతన ఉప కులపతి

ఆచార్య మునిరత్నం నాయుడు

ఫ బొమ్మూరులోని వర్సిటీలో

బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement