
విరిసిన ధరలు!
కడియం: మండలంలోని కడియపులంక అంతర్రాష్ట్ర పువ్వుల మార్కెట్‌లో దసరా సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాల అలంకరణలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో పువ్వుల ధరలు గతం కంటే మెరుగ్గా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా దసరా అలంకరణలో వినియోగించే బంతి, చామంతి తదితర రకాల ధరలు పెరిగాయని వివరించారు. స్థానికంగా పువ్వుల దిగుబడులు స్వల్పంగానే ఉన్నాయంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువగా పువ్వులు దిగుమతి అయ్యాయని వ్యాపారులు తెలిపారు. మంగళవారం కడియపులంక పువ్వుల మార్కెట్‌లో కేజీ చామంతులు రూ.150 నుంచి రూ.200 ధర పలికాయి. లిల్లీలు రూ.400, మల్లెపువ్వులు రూ.1,500, జాజులు రూ.1,000, కాగడాలు రూ.1,100, బంతి రూ. 100 నుంచి రూ.130, కనకాంబరం బారు రూ.270–రూ.300 ధర పలికాయి.