
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
● సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ
● రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు బాపూజీ
ముమ్మిడివరం: ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ డిమాండ్ చేశారు. ముమ్మిడివరం డీఎంహెచ్‌ఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన జిల్లా ఉద్యోగుల సంఘ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామసూర్యనారాయణ నాయకత్వంలో రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఉద్యోగులను ఐక్యం చేసి ముందుకు సాగుతామన్నారు. జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాలలో సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని బాపూజీ వాపోయారు. సెలవు దినాలలో కూడా ఉద్యోగులతో పని చేయించుకోవడం అన్యాయమన్నారు. ఫీల్డ్ వర్కు పేరుతో నిర్బంధించి పని చేయించడం ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మల్లిబాబు మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలో జరిగే ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి పిలుపు ఇస్తామన్నారు. జిల్లా అఽసోసియేట్ అధ్యక్షుడు కె.వీరబాబు, జిల్లా కోశాధికారి ఎస్.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముమ్మిడివరం తాలూకా కమిటీ నియామకం జరిగింది. తాలూకా అధ్యక్షుడిగా జీఎస్‌వీడీ ప్రసాద్, కార్యదర్శిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.నూకరత్నం, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పూజ, టి.సుజాత, డి.సువర్ణరాజు, ఎం.స్టీవెన్, కోశాధికారి డి.మహేష్, సహయ కార్యదర్శులుగా ఎం.రమేష్, సీహెచ్ లలిత, నియమితులయ్యారు.