తాళ్లపూడి (కొవ్వూరు): స్థానిక రోడ్ కం రైల్వే వంతెన పైనుండి గోదావరిలో దూకబోయిన మహిళను పట్టణ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే. కొయ్యలగూడెం మండలానికి చెందిన సుమారు 30 ఏళ్ల మహిళ తన కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో శుక్రవారం కొవ్వూరులోని రోడ్ కం రైల్వే వంతెన పైకి వచ్చింది. అటుగా ఆటోలో వెళ్తున్న శ్రీనివాస్ అను వ్యక్తి ఆ మహిళను గమనించి, 112 ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం వెంటనే కొవ్వూరు టౌన్ సిబ్బంది ఎంవీవీ సత్యనారాయణను స్థలానికి పంపారు. దీంతో ఆ మహిళను గుర్తించి, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని, పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె బంధువులకు అప్పగించారు.