
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ దుర్మార్గం
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కపిలేశ్వరపురం (మండపేట): వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనకు అద్దం పడుతుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మిథున్‌రెడ్డి అరెస్ట్ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అణచివేత ధోరణులను వైఎస్సార్ సీపీ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతుందని, దానిని ఓర్వలేకే తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రజా క్షేత్రం నుంచి జైళ్లలో వేయడం ద్వారా కూటమి నేతలు తమ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలని చూస్తున్నారని, వాస్తవానికి ఏ ఒక్క వైఎస్సార్ సీపీ నాయకుడు, కార్యకర్త అణచివేతలకు భయపడరన్నారు. లిక్కర్ స్కాంలో తొలుత రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయితే సిట్ రిపోర్టులో కేవలం రూ.3,500 కోట్లుగా చూపించడం ప్రభుత్వ అసంబద్ద వైఖరికి నిదర్శనమన్నారు. మిథున్‌రెడ్డిపై ఆరోపణలు ఏమాత్రం నిలబడవన్నది వాస్తవమన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను బయటపెట్టాలన్నారు. సమావేశంలో పార్టీ మండపేట నియోజకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, దూలం వెంకన్నబాబు పాల్గొన్నారు.
కక్ష సాధింపుతోనే మిథున్‌రెడ్డి అరెస్ట్
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపుతోనే కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా, కేవలం వైఎస్సార్ సీపీ నేతలపై ఎలా తప్పుడు కేసులు పెట్టి, జైల్లో పెడదామనే దుర్మార్గపు ఆలోచనలతోనే పాలన చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ కూడా ఇలాంటి అక్రమ కేసుల కోసమే సమయాన్ని పూర్తిగా కేటాయించి, లా అండ్ ఆర్డర్‌కు పనిచేయడం లేదని విమర్శించారు. అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలపై కోర్టులు అక్షింతలు వేస్తున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. ఎంపీగా, పార్లమెంట్‌లో వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్‌గా మిథున్‌రెడ్డి పోలీసు దర్యాప్తునకు సహకరిస్తున్నా, సాక్ష్యాలను తారుమారు చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని ఖండించారు. కుట్రలకు, అక్రమ కేసులకు తెరవెనుక సూత్రధారులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని పుత్రుడు, మంత్రి లోకేష్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, లీగల్‌సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ దుర్మార్గం