
ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నించరెందుకు!
ఎమ్మెల్సీ వీర్రాజుపై
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ధ్వజం
అమలాపురం టౌన్: కూట మి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న మీరు రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న అరాచకాలు, కక్ష సాధింపు చర్యలపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎమ్మెల్సీ వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయిల్ ఖండించారు. అమలాపురంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి సోము వీర్రాజుకు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దుర్భాషలాడినప్పుడు ఇదే వీర్రాజు ఏమైపోయారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుపోతుంటే మీరు చోద్యం చేస్తున్నారా...? అని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాష్ట్రంలో బెల్ట్ షాపులు, మద్యం అధిక ధరలకు విక్రయం, సారాను ఏరులై పారిస్తున్నా వాస్తవాలు ఆయనకు కనిపించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.1.75 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయ కుండా, ఏ విధంగా ఆ నిధులు ఖర్చు చేశారో లెక్కలు అడిగే దమ్ము వీర్రాజుకు ఉందా...? అని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మరోసారి ప్రశ్నించారు.