
ప్రదక్షిణ పదేపదే..
● ప‘రేషన్’
సాక్షి, రాజమహేంద్రవరం: కొత్తగా రేషన్ కార్డు పొందాలనుకున్న వారికి కూటమి ప్రభుత్వ నిబంధనలు తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు, హౌస్ మ్యాపింగ్ సమస్యలతో సతమతమవుతున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చినా ఆన్‌లైన్ సమస్యలతో చిక్కులు తప్పడం లేదు. సర్వర్ సక్రమంగా పని చేయకపోవడం, ఉన్నట్లుండి మొరాయిస్తూండటంతో సచివాలయాల వద్ద గంటలకొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోంది.
సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలోనే సర్వర్ పని చేస్తూండటంతో దరఖాస్తుదారులు ఆ సమయం వచ్చే వరకూ వేచి ఉండి మరీ వేలిముద్రలు వేస్తున్నారు. ప్రతి రోజూ ఒక్కో సచివాలయానికి పదుల సంఖ్యలో దరఖాస్తులు అందుతూంటే.. రెండు గంటల వ్యవధిలో ఐదు వరకూ ఆన్‌లైన్ చేయగలుతున్నట్లు సమాచారం. మిగిలిన వారు తెల్లముఖం వేసుకుని వెనుదిరగాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఫలితంగా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు వారు రెండు మూడు రోజుల పాటు పనులు మానుకొని సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారు రోజు కూలి కోల్పోతున్నారు.
హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌తో చిక్కులు
హౌస్ హోల్డ్ డేటా ఎనేబుల్ చేయకపోవడంతో సమస్యలు అధికంగా వస్తున్నాయి. హౌస్ హోల్డ్ సర్వేలో వివరాలు తొలగించడం, సవరించడం కుదరకపోవడంతో లబ్ధిదారులకు విపరీతమైన సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వేలో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తేనే ఈ సమస్య కొలిక్కివచ్చే అవకాశముంది. కొన్నిచోట్ల రెండు కార్డుల్లోని సభ్యులందరూ ఒకే హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఆ కార్డుల్లో ఒక సభ్యుడిని చేర్చాలన్నా, తొలగించాలన్నా సాంకేతికంగా ఇబ్బంది అవుతోంది. సభ్యులందరూ సచివాలయానికి వచ్చి వేలిముద్రలు వేయాలని సిబ్బంది చెబుతున్నారు.
దీంతో, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న రెండు కార్డుల్లోని సభ్యులందరూ సచివాలయానికి పరుగులు తీయాల్సి వస్తోంది. అవస్థలు పడి వచ్చాక.. సర్వర్ మొరాయిస్తూండటంతో అది పని చేసేంత వరకూ వేచి ఉండాల్సిందే. ఒకే కుటుంబమైనా మ్యాపింగ్ ఒకేచోట లేకపోతే దరఖాస్తు స్వీకరణ సమయంలో ఆన్‌లైన్‌లో ఎర్రర్ చూపిస్తోంది. దీని సవరణకు ఒక్కోసారి రెండు రోజులు కూడా పడుతోంది. దీంతో, ఉద్యోగులు సెలవు పెట్టి మరీ వేచి చూడాల్సి వస్తోంది.
ఓటీపీ ఆప్షన్‌కు మంగళం
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియలో దరఖాస్తుదారు వేలిముద్రలు (బయోమెట్రిక్) తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. అవి పడకుంటే దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. గతంలో ఆధార్ లింక్ అయిన సెల్‌ఫోన్‌కు ఓటీపీ వచ్చేది. దీనివల్ల బయోమెట్రిక్స్ పడిన వారికి ఉపయోగకరంగా ఉండేది. ప్రభుత్వం ఓటీపీ ఆప్షన్ డిజేబుల్ చేయడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు.
కొత్త జంటలకు తప్పని తిప్పలు
కొత్తగా పెళ్లయిన జంటలు రేషన్ కార్డు పొందేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. కొత్తగా పెళ్లయిన వారిలో ఒకరిని కార్డులో చేర్చేందుకు వివాహ ధ్రువీకరణ పత్రాలు, పెళ్లి కార్డులు, ఫెళ్లి ఫొటోలు అప్‌లోడ్ చేయాలనే నిబంధన పెట్టారు. అవి లేకపోతే అప్‌లోడ్ కాక ఈ నెల 7 నుంచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని చెబుతున్నప్పటికీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయకపోవడంతో సాంకేతికంగా ఇబ్బంది ఎదురవుతోంది.
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లేని జంటలు రెండు వారాలుగా రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఎప్పుడో వివాహమై సంతానం కలిగిన వారికి ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్లు అడగడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్ల నిబంధన తొలగించాలనే డిమాండ్ సర్వత్రా వస్తోంది.
రేషన్ కార్డు దరఖాస్తులకు అవస్థలు
సచివాలయాల చుట్టూ
తిరగాల్సిన దుస్థితి
రెండు మూడు రోజుల పాటు
పనులకు తప్పని బ్రేక్
నమోదు కేంద్రాల వద్ద పడిగాపులు