గుల్జార్‌ హౌస్‌లు! | - | Sakshi
Sakshi News home page

గుల్జార్‌ హౌస్‌లు!

May 20 2025 12:26 AM | Updated on May 20 2025 12:26 AM

గుల్జ

గుల్జార్‌ హౌస్‌లు!

మనకీ ఉన్నాయి..

ఈ జాగ్రత్తలు అవసరం

ఇళ్లు, అపార్టుమెంట్లు, గ్రూప్‌ హౌస్‌ల వంటి నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం అక్షరాలా ప్రాణ రక్షణతో సమానం. అగ్నిమాపక విభాగం, నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌బీసీ) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ప్రమాణాలు ఈ అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతగానో దోహదపడతాయి.

ఫ ప్రతి భవంతిలో రెండు ఫైర్‌ ఎగ్జిట్‌లు తప్పనిసరి. అవి ఎక్కడున్నాయో అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియాలి. వినియోగించడంపై అవగాహన ఉండాలి.

ఫ ఫైర్‌ అలారం వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలి. పొగ, మంటలు చెలరేగినప్పుడు స్పీకర్లు, హెచ్చరిక లైట్లతో అప్రమత్తం చేసే ఏర్పాట్లు అవసరం.

ఫ ప్రతి ఫ్లోర్‌లో ఫైర్‌ ఎక్ట్సింగ్విషర్లు తగినన్ని ఉండాలి. వాటి పని తీరును ప్రతి నాలుగు నెలలకోకసారి పరిశీలించుకోవాలి.

ఫ భారీ భవంతుల్లో ఫైర్‌ హైడ్రెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అనూహ్యంగా ప్రమాదాలేవైనా జరిగితే వీటి ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలను మరింత సులువుగా చేపట్టగలుగుతారు.

ఫ 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రతి భవనంలోనూ వాటర్‌ స్ప్రింక్లర్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేయాలి.

ఫ కనీసం ప్రతి ఆరు నెలలకోసారి ఫైర్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తే నివాసితుల్లో అవగాహన పెరుగుతుంది.

ఫ విద్యుత్‌ వైరింగ్‌, ఉపకరణాల్లో లోపాలే చాలా అగ్నిప్రమాదాలకు మూలం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్‌ సేఫ్టీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భవన యజమానులకు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ తీగలు, సాకెట్లు క్రమం తప్పకుండా నాణ్యంగా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి. షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫ ప్రతి భవనం నిర్మాణ సమయంలో అగ్నిమాపక విభాగం నుంచి ఫైర్‌ సేఫ్టీ అప్రూవల్‌ తప్పనిసరిగా తీసుకోవాలి.

హైదరాబాద్‌ పాతబస్తీ అగ్ని ప్రమాదంతో ఉలికిపాటు

మన భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు

కాకినాడ, రాజమహేంద్రవరం సహా పలుచోట్ల ప్రమాదకరంగా భవనాలు

ముందే మేల్కొంటే మేలు

కాకినాడ క్రైం: హైదరాబాద్‌లో చార్మినార్‌ దగ్గరలోని గుల్జార్‌ హౌస్‌లో ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం 17 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న సంఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఈ ప్రమాదంలో అందరూ సజీవ దహనమైపోయారు. చనిపోయిన వారిలో ఐదేళ్ల లోపు పిల్లలు ఎనిమిది మంది, 60 ఏళ్ల పైబడ్డ వారు ఐదుగురు ఉన్నారు. ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని ఘోర అగ్ని ప్రమాదమిది. ఈ ప్రమాదంలో తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారిలో అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో బయటపడడం ఏ ఒక్కరికీ సాధ్యం కాలేదు. ఈ ఘోర కలి మన నగరాల్లోని భవనాలల్లో భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇటువంటి ఇరుకై న వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మనమూ ముందస్తుగా మేల్కోవలసిన ఆవశ్యకతను గుల్జార్‌ హౌస్‌ ప్రమాదం గుర్తు చేస్తోంది.

ఇరుకు ప్రాంతాలు.. భద్రత లేని భవనాలు

కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో చాలా ప్రాంతాలు ఎంతో ఇరుకుగా ఉన్నాయి. మెయిన్‌ రోడ్లు సహా మార్కెట్‌ వీధులు, ఇతర ప్రాంతాల్లో ఇటువంటి భవనాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కాకినాడ మెయిన్‌ రోడ్డులో మసీద్‌ సెంటర్‌ మొదలు జగన్నాథపురం వంతెన వరకూ కుడి, ఎడమ వైపున అనేక దుకాణాలను గ్రౌండ్‌ ఫ్లోర్లలోనే నిర్వహిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్లోర్‌తో స్టాక్‌ పెట్టి, రెండో అంతస్తులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రాజమహేంద్రవరం మెయిన్‌ రోడ్డును ఆనుకుని ఉన్న అనేక వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు ఇదే రీతిలో ఉన్నాయి. దాదాపు వీటన్నింటిలోనూ పై అంతస్తుల నుంచి కిందకి దిగడానికి ఒకటే మార్గం ఉంటోంది. ఊహించని విధంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేని పరిస్థితి.

ఫ కొద్ది రోజుల క్రితం కాకినాడ సంతచెరువు జంక్షన్‌లోని ఓ భవంతి ఒకటో అంతస్తులో ఏసీ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.

ఫ కాకినాడ భానుగుడి కూడలిలో వ్యాపార సముదాయాలు కలిగిన సుభద్ర ఆర్కేడ్‌లో కొన్నాళ్ల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్‌ ప్యానళ్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. ఉదయం వేళ కావడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి, ప్రమాదాన్ని నిలువరించారు.

నిలిచిన తనిఖీలు

ఫైర్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్లు నిలిపి వేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అగ్నిమాపక శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలున్నాయి.

జిల్లా స్థాయిలో ప్రస్తుతం తనిఖీలేవీ జరగడం లేదు. గతంలో భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ తనిఖీలు చేసి, ఒకే మార్గాలున్న భవనాలన్నింటికీ అదనపు మెట్ల మార్గాలు ఏర్పాటు చేయించారు. అయితే, కొన్ని నెలల క్రితం నుంచి ఆ తనిఖీలకు తిలోదకాలిచ్చారు.

పొగే ప్రమాదకారి

మంటలు వ్యాప్తి చెందే తొలి దశలో మంటల కంటే పొగే ప్రమాదకారి. హైదరాబాద్‌ ఘటనలో 17 మరణాలు సంభవించడానికి కారణం కూడా పొగ వ్యాపించి, ఊపిరి ఆడకపోవడమే. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని సైతం ఈ పొగ అడ్డుకుంటుంది. ఊపిరాడకుండా చేసి, ప్రాణాలు తీస్తుంది. ఇరుకై న నివాస, వర్తక సముదాయాలు అగ్నిప్రమాదాలకు నిలయాలు. ఆయా ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత మార్గదర్శకాలు పాటిస్తూ మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్‌ రాజేష్‌ ఆధ్వర్యంలో తరచుగా చేపడుతున్న మాక్‌ డ్రిల్‌, అవగాహన సదస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

– ఉద్దండురావు సుబ్బారావు,

జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి, కాకినాడ

గుల్జార్‌ హౌస్‌లు!1
1/4

గుల్జార్‌ హౌస్‌లు!

గుల్జార్‌ హౌస్‌లు!2
2/4

గుల్జార్‌ హౌస్‌లు!

గుల్జార్‌ హౌస్‌లు!3
3/4

గుల్జార్‌ హౌస్‌లు!

గుల్జార్‌ హౌస్‌లు!4
4/4

గుల్జార్‌ హౌస్‌లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement