
కొత్తిమీర.. అధర గొట్టేలా..
పెరవలి: దాదాపు ప్రతి ఒక్కరూ నిత్యం వంటల్లో ఉపయోగించే కొత్తిమీరకు ప్రస్తుతం మంచి ధర పలుకుతోంది. సాగు చివరి దశకు చేరడంతో మార్కెట్లోకి కొత్తిమీర రావడం కాస్త తగ్గుతోంది. దీంతో, మార్కెట్‌లో దీని ధర పెరుగుతోంది. దీనికి అనుగుణంగా రైతు వద్ద కూడా ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పెరవలి మండలం అన్నవరప్పాడు, ఖండవల్లి, ముత్యాలవారిపాలెం, లంకమాలపల్లి, ఓదూరివారిపాలెం, కాకరపర్రు, తీపర్రు, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు గ్రామాల్లో సుమారు 150 ఎకరాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు కొత్తిమీర సాగు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కిలో కొత్తిమీర ధర ఏకంగా రూ.150కి పెరిగింది. అంతలోనే దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌ను ముంచెత్తడంతో క్రమంగా ధర తగ్గుతూ వచ్చి కిలోకు ఏకంగా రూ.20కి పడిపోయింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు నిర్వేదానికి గురై, ప్రజలను కొత్తిమీర ఉచితంగా పట్టుకెళ్లిపొమ్మని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దశలో కూలి రేట్లు కూడా పెరిగిపోవడంతో కొత్తిమీర మొక్కలు తీసి, కట్టలు కట్టే కన్నా పొలంలో వదిలేస్తేనే నయమని రైతులు భావించారు. అటువంటిది.. ప్రస్తుతం సాగు చివరి దశకు రావడంతో దిగుబడి తగ్గి, కొత్తిమీర ధర క్రమేపీ పెరగడం మొదలైంది. ప్రస్తుతం రైతుకు కిలో రూ.60 వరకూ దక్కుతోంది. మార్కెట్‌లో వినియోగదారులకు ఒక్కో కొత్తిమీర కట్ట రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నారు. కిలోకు ఐదారు కట్టలు వస్తాయి. దీని ప్రకారం మార్కెట్‌లో కిలో కొత్తిమీర ధర రూ.100 నుంచి రూ.150 వరకూ పలుకుతోంది. కానీ, రైతుకు రూ.60 మాత్రమే దక్కుతోంది. ధర మరి కాస్త పెరిగితే తమకు మరింత మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో కొత్తిమీర సాగుకు రూ.25 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. దిగుబడి రెండు మూడు టన్నులు వస్తోంది. టన్నుకు రూ.60 వేలు వస్తోందని, పెట్టుబడి, ఇతర ఖర్చులు పోనూ ఎకరానికి నికరంగా రూ.30 వేలు మిగులుతుందని రైతులు చెబుతున్నారు. అయితే, దిగుబడులు తగ్గిన తరువాత ధర పెరగడంతో నష్టపోతున్నామని వాపోతున్నారు.
ధర స్థిరంగా ఉంటే..
పదెకరాల్లో కొత్తిమీర సాగు వేశా ను. ఎకరానికి రూ.20 వేల వర కూ పెట్టుబడి అయ్యింది. ఎనిమిదెకరాల్లో పంట ముందుగా రావడంతో కిలో రూ.20 నుంచి రూ.25 మధ్య అమ్మాల్సి వచ్చింది. పెట్టుబడి కూడా రాలేదు. ప్రస్తుతం కిలోకు రూ.60 పలుకుతోంది. దిగుబడిని బట్టి ఎకరానికి రూ.40 వేల నుంచి రూ. 50 వేల వరకూ వస్తుంది. ఈ ధరలు స్థిరంగా ఉంటే మొదటి పంట నష్టం కొంతవరకూ పూడ్చుకోగలం.
– ఆకుల సూర్యనారాయణ, రైతు, ముత్యాలవారిపాలెం
ఫ గతంలో కిలో రూ.20కి పడిపోయిన రైతు ధర
ఫ నేడు ఏకంగా రూ.60కి పెరుగుదల
ఫ రిటైల్ మార్కెట్‌లో రూ.100కు పైనే

కొత్తిమీర.. అధర గొట్టేలా..

కొత్తిమీర.. అధర గొట్టేలా..