
అనుమానాస్పద స్థితిలో జంట ఆత్మహత్య?
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో ఒక జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం కలకలం రేపింది. సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఓ రైలుకు అడ్డుగా ఆ జంట నిలబడి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాల వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో రైల్వే పోలీసులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే కాకినాడలోని ఓ ఆఫీస్‌లో అకౌంటెంట్‌గా సదరు వ్యక్తి పని చేస్తున్నట్లు, ఆ మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని రైల్వే మేనేజర్ రమేష్ వివరించారు. ఆ జంటకు వేర్వేరుగా వివాహాలు కాగా, ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు రాత్రి వరకూ ఎటువంటి వివరాలు చెప్పకపోవడం గమనార్హం.