
పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి
● సాక్షి ఎడిటర్ ఇంట్లో
నిర్భంధ సోదాలు అన్యాయం
● పాత్రికేయుల నిరసనలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధానాలకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాత్రికేయులు గురువారం నిరసనలు తెలిపారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు.. విజయవాడలో సాక్షి సంపాదకులు ధనంజయరెడ్డి ఇంట్లోకి చొరబడి, అక్రమంగా సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను ప్రజాసంఘాలు, పౌర సమాజం ముక్తకంఠంతో ఖండించాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల అక్రమ సోదాలను నిరసిస్తూ రాజమహేంద్రవరంలో సాక్షి పాత్రికేయులు గురువారం సాయంత్రం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌డీఓ ఆర్.కృష్ణనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వార్తలు రాస్తున్నందుకు సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని అన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులూ లేకుండా అక్రమంగా సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వ విధానాలపై వార్తలు రాస్తే వాటిరి వివరణలు ఇవ్వవచ్చని, అంతే తప్ప ఎడిటర్ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా ప్రవర్తించడం మంచిది కాదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఫయాజ్ బాషా, సాక్షి టీవీ ప్రతినిధి హరీష్, కెమెరామన్ మురళి, ఆర్‌సీ ఇన్‌చార్జులు కె.శ్యామ్‌శేఖర్‌రెడ్డి, వై.విశ్వనాథం, విలేకర్లు సత్యంబాబు, అంగర రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టుల ధర్నా
నిడదవోలు: సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసుల అక్రమ సోదాలను నిరసిస్తూ నిడదవోలు జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యాన పాత్రికేయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా పోలీసులు తనిఖీలు చేయడాన్ని నిరసిస్తూ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినదించారు. అనంతరం సీఐ పీవీజీ తిలక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని, పత్రికా రంగాన్ని అవమానించడమేనని అన్నారు. ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. వాస్తవాలను ప్రచురిస్తున్న పత్రికలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సాక్షి నిడదవోలు ఆర్‌సీ ఇన్‌చార్జి గాడి శేఖర్‌బాబు, సాక్షి విలేకర్లు ఎం.సత్యనారాయణ, ఎం.రవితేజ, సయ్యద్ ఇబ్రహీం, జర్నలిస్టులు కాట్రు వసంతరాజు, గూడూరి రమణ, మహమ్మద్ జావీద్, గురునాథరెడ్డి, టి.రాము, కె.మణికంఠ, షేక్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.