
విమానాశ్రయంలో మాక్‌డ్రిల్
కోరుకొండ: యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఏవిధంగా స్పందించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ ఏఎస్పీ చెంచిరెడ్డి ఆధ్వర్యాన గురువారం సాయంత్రం మాక్‌డ్రిల్ నిర్వహించారు. బాంబు పేలుళ్లు జరిగినప్పుడు విమాన ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. బాంబింగ్ సమయంలో ప్రయాణికులు పరుగులు తీయకుండా నేలకు వాలి ఉండటం సురక్షితమని చెప్పారు. కార్యక్రమంలో విమానాశ్రయం ఇన్‌చార్జి డైరెక్టర్ శ్రీకాంత్, ఎస్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రసాదరావు, అగ్నిమాపక అధికారి గుప్తా, కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై కూన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మాక్‌డ్రిల్‌తో ప్రజలకు అవగాహన
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఏవిధంగా స్పందించాలనే అంశంపై మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్ కం రైల్వే వంతెన వద్ద మాక్ డ్రిల్ ద్వారా గురువారం అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ మాట్లాడుతూ, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. యుద్ధ పరిస్థితులు వస్తే సైరన్ అలార్మింగ్ మోగుతుందని, దానిని అనుసరించి ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, ఇతరులను రక్షించడం, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందజేయడం, తరలింపు ప్రక్రియల్లో భాగస్వాములు కావాలని కోరారు. యుద్ధ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, స్వీయ రక్షణ చర్యలపై డీఆర్‌వో టి.సీతారామమూర్తి, ఆర్‌డీఓ ఆర్.కృష్ణనాయక్, డీఎస్పీ భవ్యకిషోర్, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూధర్ కింగ్ తదితరులు వివరించారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.