
కుమార్తె కళ్ల ఎదుటే...
రోడ్డు ప్రమాదంలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ వెంకటరమణ మృతి
ధవళేశ్వరం: అల్లారుముద్దుగా పెంచిన కన్న తండ్రి కళ్ల ఎదుటే రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువాత పడటంతో ఆ కుమార్తె రోదన వర్ణనాతీతం. రోజూ ఉద్యోగం కోసం వెళ్లే తనను బస్సు ఎక్కించేందుకు తీసుకువెళ్లే తండ్రి తిరిగిరాని లోకాలకు చేరడంతో ఆ కుమార్తె రోదనలు చూపరులకు కన్నీళ్లు తెప్పించాయి. తండ్రితో బైక్‌పై ఆమె వెళుతున్న ప్రయాణం అదే ఆఖరని ఆమె ఊహించి ఉండకపోవచ్చు. ధవళేశ్వరం ప్రధాన రహదారిపై యూనియన్ బ్యాంక్ సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బత్తిన వెంకటరమణ (56) మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి... బొబ్బిల్లంకకు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బత్తిన వెంకటరమణ కుటుంబంతో కలిసి కొంతమూరులో నివాసం ఉంటున్నారు. మృతుడు వెంకటరమణ పెద్ద కుమార్తె మనీష ముక్తేశ్వరం యూనియన్ బ్యాంక్‌లో పీవోగా పనిచేస్తున్నారు. రోజూ కుమార్తెను రాజమహేంద్రవరంలో బస్సు ఎక్కించి వెంకటరమణ విధులకు వెళ్లేవారు. వేమగిరి చెక్‌పోస్టు వద్ద మంగళవారం విధులు నిర్వర్తించేందుకు వెళుతున్న వెంకటరమణ కుమార్తెను ధవళేశ్వరంలో బస్సు ఎక్కించేందుకు బైక్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో వెంకటరమణ తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్ళడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న వెంకరమణ కుమార్తె మనీష స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన తెలుసుకున్న ధవళేశ్వరం సీఐ టి గణేష్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందడంతో పోలీసు సిబ్బందిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. జిల్లా ఎస్పీ టి.నరసింహకిశోర్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటరమణ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధవళేశ్వరం ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుమార్తె కళ్ల ఎదుటే...

కుమార్తె కళ్ల ఎదుటే...