దేవరపల్లి: నాలుగు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల ముగింపు సందర్భంగా గౌరీపట్నంలోని నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం జనసంద్రమే అయ్యింది. సోమవారం రాత్రి పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు, ఫాదర్లు, పాస్టర్లు సాయంత్రం 6 నుంచి రాత్రి 2 గంటల వరకూ ప్రార్థనలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. పుణ్యక్షేత్రంలో క్రీస్తు నామం ప్రతిధ్వనించింది. పీఠాధిపతులు నిర్వహించిన దివ్యబలి పూజ సమర్పణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆశీస్సులు పొందారు.
అద్భుతాలకు నిలయం
అనేక అద్భుతాలకు నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం నిలయమని ఏలూరు పీఠాఽధిపతి, విశాఖ అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర అన్నారు. మేరీమాత మహోత్సవాల సందర్భంగా పుణ్యక్షేత్రంలో జయరావు పొలిమెర, ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్, నెల్లూరు పీఠాథిపతి పిల్లి ఆంథోనీదాస్, పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్‌లు మంగళవారం రాత్రి సమష్ఠి దివ్యబలి పూజ సమర్పించారు. ఈ సందర్భంగా అగ్ర పీఠాధిపతి జయరావు పొలిమెర మాట్లాడుతూ, అఖండ దేవాలయాన్ని నిర్మించుకుని 25 వసంతాలైందని అన్నారు. మన దేశం, ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని నిర్మలగిరి మేరీమాత కొండ వద్ద ప్రార్థిస్తున్నామని ఆయన తెలిపారు. ఏలూరు కథోలిక పీఠం పరిధిలోని గౌరీపట్నంలో మరియతల్లి.. నిర్మలగిరి మేరీమాతగా భక్తుల పూజలందుకుంటోందని చెప్పారు. బాధలతో ఉన్న అనేక మంది ఆ తల్లి చెంతకు చేరి ప్రార్థిచగా, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్ఖానాల్లో పని చేస్తున్న కార్మికులకు మంచి వేతనాలు లభించాలని ప్రార్థించామన్నారు. ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్ మాట్లాడుతూ, నిర్మలగిరి పుణ్యక్షేత్రం ప్రజలందరి కోసం వెలసిన పుణ్యభూమి అని అన్నారు. సమైక్యతా స్థలంగా అలరారుతోందన్నారు. దైవానుభూతికి పుణ్యక్షేత్రం తార్కాణంగా, స్వర్గధామంగా ఉందని చెప్పారు. నెల్లూరు పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ మాట్లాడుతూ, రక్షణ చరిత్రలో మరియమాత ప్రధాన భూమిక పోషించిందని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు వికార్ జనరల్ ఫాదర్ పి.బాల, జి.మోజెస్, దిరిసిన ఆరోన్, పలువురు గురువులు, కన్యలు, భక్తులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పీఠాల నుంచి పుణ్యక్షేత్రం మహోత్సవాలకు వచ్చిన పీఠాధిపతులు, గురువులకు పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్ ఘన స్వాగతం పలికారు. మరియతల్లి స్వరూపం వద్ద పీఠాధిపతులు ప్రార్థన చేశారు. అనంతరం కొండపై నిర్మించిన 30 అడుగుల పునీత ఆంథోనీ స్వరూపాన్ని జయరావు పొలిమెర ఆవిష్కరించారు. వివిధ విచారణల నుంచి వచ్చిన బైబిల్ జ్యోతులను పీఠాధిపతులు స్వీకరించారు.
ఘనంగా జూబ్లీ వేడుకలు
పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం నిర్మించి, 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
ఫ సమష్టి దివ్యబలి
పూజ సమర్పించిన పీఠాధిపతులు
ఫ అశ్వరథంపై ప్రదర్శన
నిర్మలగిరి.. జన కడలి