కడియం: మండలంలోని జేగురుపాడు గ్రామానికి చెందిన 40 ఏళ్ల నాగిరెడ్డి సత్తిబాబు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా శరీరం కదల్చలేని పరిస్థితికి చేరాడు. మంచంపైనే అన్నీ చేయాల్సిన స్థితిలో ఉన్నాడు. వ్యవసాయ కూలీ కావడంతో అతడికి వైద్యం చేయించడం, కుటుంబాన్ని పోషించుకోవడం అతడి భార్య చక్రవేణికి శక్తికి మించిన భారమైంది. కనీసం పెన్షన్ అయినా వస్తే మంచంపై ఉన్న సత్తిబాబుకు వైద్యం సక్రమంగా అందుతుందన్న ఆశతో అతడి భార్య తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుతోంది. సంబంధిత పత్రాలు పట్టుకుని తిరుగుతోంది. అతికష్టం మీద కాకినాడ తీసుకువెళ్లగా, అక్కడి వైద్యులు 90శాతం వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్ ఇచ్చారు. వీటన్నిటితో పెన్షన్‌కు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సత్తిబాబుకు మాత్రం పెన్షన్ మంజూరు కాలేదు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్వయంగా సత్తిబాబు పరిస్థితిని చూసి, వెంటనే పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినప్పటికీ పెన్షన్ మంజూరు లిస్టులో పేరు మాత్రం రాలేదు. దీంతో మంచంపైనే ఉన్న భర్త, ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకురావడానికి ఆమె నానా యాతనలు పడుతోంది. ఎవరైనా పలకరిస్తే కన్నీళ్లే ఆమె సమాధానంగా ఉంటోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు కలుగజేసుకుని సత్తిబాబుకు పెన్షన్ మంజూరు చేయించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
90 శాతం వైకల్యం ఉన్నా ఎదురుచూపులు