హక్కులకు రక్షణ కవచం | - | Sakshi
Sakshi News home page

హక్కులకు రక్షణ కవచం

Mar 15 2025 12:35 AM | Updated on Mar 15 2025 12:34 AM

కేసుల నమోదైన అపరాధ

స్వభావం కేసులు రుసుం

(రూ.లు)

హార్డ్‌వేర్‌ 54 3,24,500

ఫెర్టిలైజర్స్‌ 31 3,75,000

చికెన్‌ షాపులు 37 31,500

బేకరీస్‌ 22 79,000

రైస్‌ షాపులు 11 92,500

సాక్షి, రాజమహేంద్రవరం/కాకినాడ లీగల్‌:

ఉప్పు, పప్పు, బియ్యం, పాలు, నూనె, కూరగాయల నుంచి బంగారం వరకూ.. మోసానికి కాదేదీ అనర్హం అన్న చందంగా మారింది వినియోగదారుల పరిస్థితి. ఒక వ్యక్తి రూ.10 వేల కిరాణా సామగ్రి కొనుగోలు చేస్తే.. తూకాల్లో మోసాల కారణంగా రూ.1,000 వరకూ నష్టపోవాల్సి వస్తోంది. దీనికి తోడు వస్తు, సేవల్లో నాణ్యతా లోపాలతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత అవసరాల కోసం పలు రకాల వస్తువులకు, సేవలకు నిర్దేశిత డబ్బు చెల్లించిన ప్రతి ఒక్కరూ వినియోగదారులే. ఆ వస్తువు, సేవలు సంతృప్తికరంగా లేకుంటే మోసపోయినట్టే. దీనిని భరించి, నష్టపోవడంకన్నా, పోరాడితే పరిహారం పొందడమే కాకుండా, మరొకరు మోసపోకుండా ఉండే అవకాశం కలుగుతుంది. వస్తువుకు సంబంధించిన సమాచారం పొందడం, నచ్చిన వస్తువును ఎంచుకునే అవకాశం కల్పించడం, వినియోగదారుకు రక్షణ కల్పించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్‌ కెన్నడీ తొలిసారిగా 1962 మార్చి 15న అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. తదనంతర కాలంలో ఈ అంశాలకు ప్రాధాన్యం పెరగడంతో 1983 నుంచి ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం 1986లో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, వినియోగదారుల కమిషన్‌ ఏర్పాటు చేసింది. వస్తు, సేవల్లో నష్టపోయిన వినియోగదారులు కమిషన్‌లో నామమాత్రపు రుసుంతో కేసు వేసి, తగిన పరిహారం పొందవచ్చు. ఇటువంటి మోసాలపై పలువురు వినియోగదారులు తగిన ఆధారాలతో న్యాయస్థానాలను, వినియోగదారుల కమిషన్లను ఆశ్రయిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌, బీమా కంపెనీల మోసాలకు సంబంధించి 168 కేసులు వినియోగదారుల కమిషన్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

తూకాల్లో మోసాలు ఇలా..

● రాజమహేంద్రవరంలోని ఓ బియ్యం దుకాణంలో ఓ వినియోగదారు రూ.1,600కు 26 కిలోల బియ్యం బస్తా కొనుగోలు చేశారు. వ్యాపారి వద్ద ఎలక్ట్రానిక్‌ కాటాలో తూకం వేయగా 26 కిలోలు చూపించింది. అదే బస్తాను వేరే కాటాలో తూకం వేయగా 2 కిలోల బియ్యానికి కోత పడింది.

● రాజమహేంద్రవరంలోని ఓ మాంసం దుకాణంలో ఓ వినియోగదారు కిలో చికెన్‌ రూ.180కి కొనుగోలు చేశారు. అక్కడ వేసిన ఎలక్ట్రానిక్‌ తూకంలో 1000 గ్రాములు చూపించింది. బయట వేరే చోట తూకం వేయగా.. 100 గ్రాముల వరకూ తగ్గింది. ఈ రెండు సంఘటనలు తూకాల్లో మోసాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి.

ఏం జరుగుతోందంటే..

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో తూకాల్లో మోసాలతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నెల రోజులు రావాల్సిన బియ్యం బస్తా 20 రోజులే వస్తోంది. మరో పది రోజులకు అదనంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అత్యంత ఖరీదైన బంగారం విక్రయాల్లో సైతం దోపిడీ ఆగడం లేదు. తూకం సమయంలో ఏమార్చి మాయ చేస్తున్నారు. ఈ మోసాలకు చెక్‌ చెప్పేందుకు తూనికలు – కొలతల శాఖ ఉన్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడపాదడపా దాడులు, కేసులు తప్ప.. ఆపై మిన్నకుండిపోతూండటంతో కొందరు వ్యాపారులు తిరిగి అదే తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

● ప్రస్తుతం అన్నిచోట్లా ఎలక్ట్రానిక్‌ కాటాలు వినియోగిస్తున్నారు. కొందరు మాత్రం ఇంకా తూకం రాళ్లనే వాడుతున్నారు. వీటిని రెండేళ్లకోసారి తూనికలు – కొలతల శాఖ అధికారులు తనిఖీ చేసి, అరిగిన భాగం పరిమాణంలో సీసం నింపి, సీలు వేయాలి. ఎలక్ట్రానిక్‌ తూనిక యంత్రాలకు ఏడాదికోసారి ముద్ర వేయాలి.

● వంట గ్యాస్‌ డెలివరీ సమయంలో సిబ్బంది, ఇంటి వద్ద గ్యాస్‌ బండను స్ప్రింగ్‌ త్రాసు ద్వారా కొలిచి ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. దీనిని గ్యాస్‌ ఏజెన్సీలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలి. కానీ, అలా జరగడం లేదు.

తూకం వేళ అప్రమత్తం

● వస్తువులను తూచే ముందు కౌంటర్‌ స్కేలు పళ్లేల రెండు సూచికలు కచ్చితంగా ఒకదానికెదురుగా మరొకటి ఉండేలా చూడాలి.

● ప్రతి తూనిక అడుగు భాగంలో అధికారులు వేసిన ముద్ర ఉందో లేదో గమనించాలి.

● కొలత పాత్రలను కట్‌ చేయడం, లోపల బాగా మందంగా తారు పూయడం, కింది భాగంలో నొక్కినట్లుగా సొట్టలు పెట్టడం, అడుగు భాగం తగ్గించి వెల్డింగ్‌ చేయడం వంటి పద్ధతుల్లో వ్యాపారులు మోసగిస్తూంటారు. వీటన్నింటినీ వినియోగదారులు పరిశీలించుకోవాలి.

కమిషన్‌ను ఎప్పుడు ఆశ్రయించవచ్చంటే..

● కొనుగోలు చేసిన వస్తువులు, మందులు, ఇతర ఉత్పత్తులతో ప్రాణ, ఆస్తినష్టం కలిగినా..

● ఆసుపత్రుల్లో సేవా లోపంతో ఇబ్బంది కలిగినా..

● వినియోగించే వస్తువుల నాణ్యత, స్వచ్ఛత లోపించినా..

● నకిలీ విత్తనాలు, ఇతల అనైతిక వాణిజ్య విధానాలు.

● వ్యాపారి లేదా డీలర్‌ ద్వారా నష్టపోయినా..

● అసలు ధర కంటే ఎక్కువ వసూలు చేసినా..

● బ్యాంకు, బీమా, రవాణా, తయారీ సేవల్లో లోపాలు జరిగినా..

● అపార్ట్‌మెంట్ల విక్రయాల్లో మోసం, ఇంటి నిర్మాణంలో లోపాలు.

● వినోదం, వివిధ వృత్తి సేవల్లో లోపాలు.

● ఇతర కారణాలతో నష్టపోయినా..

నోటీసు పంపాలిలా..

● కొనుగోలు చేసిన ఉత్పత్తి లేదా సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీ పూర్తి చిరునామా రాయాలి. కొన్న వస్తువు లేదా సేవల వివరాలివ్వాలి. క్యాష్‌ మెమో నంబర్‌, తేదీ ఇవ్వాలి.సంస్థ ఇచ్చిన వారెంటీ లేదా గ్యారెంటీ వివరాలు తెలపాలి. వస్తువు లేదా సేవలో జరిగిన లోపం, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను విపులంగా వివరించాలి. ఈ ఇబ్బందులపై అప్పటి వరకూ ఎవరెవరికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారో పేర్కొనాలి. ఉంటే కంప్లయింట్‌ నంబర్‌ ఇవ్వాలి. ఈ సంప్రదింపులకు సంబంధించిన ఆధారాల జిరాక్స్‌ పత్రాలు నోటీసుకు జత చేయడం మంచిది.

● నోటీసుకు స్పందించడానికి సంబంధిత సంస్థ లేదా వ్యక్తికి 15 నుంచి 30 రోజుల వరకూ గడువు ఇవ్వాలి. కోరుతున్న నష్టపరిహారం, పూర్తి మొత్తం కోరితే దానికి 18 శాతం వరకూ వడ్డీ లేదా కొత్త వస్తువు ఇవ్వాలని కోరవచ్చు. దానికి నష్టపరిహారం కూడా కావాలని కోరవచ్చు.

● వినియోగదారు పూర్తి పేరు, అడ్రస్‌ ఇవ్వాలి.

● నోటీసు అవతలి వ్యక్తి లేదా సంస్థకు ఇచ్చినట్లు వినియోగదారు వద్ద తగిన తిరుగు రశీదు లేదా కొరియర్‌, హ్యాండ్‌, ఆన్‌లైన్‌ డెలివరీ రశీదు వంటి ఆధారాలు ఉండాలి. వీటిని కోర్టులో సమర్పించాలి.

ఫిర్యాదు ఇలా..

వస్తు, సేవల కొనుగోలు సందర్భంగా నష్టపోయిన వారు వినియోగదారుల కమిషన్‌లో నేరుగా లేదా న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అక్కడి సహాయ కేంద్రం సలహాలు తీసుకుని కేసు దాఖలు చేయవచ్చు. గతంలో వస్తువు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే కేసు దాఖలు చేయాల్సి ఉండేది. 2019 వినియోగదారుల రక్షణ చట్టంలో మార్పు అనంతరం.. వస్తువు ఎక్కడ కొన్నా తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో కేసు దాఖలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించారు. అలాగే, ఒక వస్తువు సరిగ్గా పని చేయకపోతే గతంలో కంపెనీపై మాత్రమే కేసు వేసేవారు. చట్టంలో మార్పు అనంతరం వస్తువు విక్రయించిన షాపు యాజమాని, ఏజెన్సీ, కంపెనీపై కూడా కేసు దాఖలు చేసే అవకాశఽం కలిగింది.

ఈ జాగ్రత్తలు మేలు

● అవసరమైన వస్తువులనే ఎంపిక చేసి, కొనుగోలు చేయాలి. ఆ వస్తువుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి.

● మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలి.

● నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఆఫర్లను పూర్తిగా పరిశీలించుకోవాలి.

● వస్తువులు, సేవల కొనుగోలుకు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి.

● గ్యారంటీ లేదా వారంటీ కార్డులపై సంబంధిత విక్రేత సంతకం, ముద్ర సహా ఉండేలా చూసుకోవాలి.

● మోసానికి గురైతే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడానికి ఇవి ఉపయోగపడతాయి.

498 కేసులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకూ తూనికలు – కొలతల శాఖ రాజమహేంద్రవరం సర్కిల్‌ పరిధిలో (కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు మినహా) తూకాలు, ప్యాకేజీ నీడ్స్‌ వంటి వాటిలో జరిగిన మోసాలపై 498 కేసులు నమోదయ్యాయి. అక్రమాలకు పాల్పడిన వ్యాపారులకు రూ.46,52,500 అపరాధ రుసుం విధించారు.

మోసాలను ఉపేక్షించం

వినియోగదారులను వ్యాపారులు మోసం చేస్తే ఉపేక్షించం. ఇటీవల ఉల్లిపాయల వ్యాపారులపై కూడా ఫిర్యాదు వస్తున్నాయి. ఫిర్యాదు అందిన వెంటనే దాడులు చేసి కేసులు పెట్టి, అపరాధ రుసుం విధిస్తున్నాం. వినియోగదారులు తాము మోసపోయామని గ్రహిస్తే వెంటనే వ్యాపారిని హెచ్చరించడం లేదా మా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. వస్తువుల కొనుగోలు సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే వ్యాపారుల మోసాలను పూర్తి స్థాయిలో అడ్డుకోవచ్చు.

– కె.శామ్యూల్‌ రాజు, అసిస్టెంట్‌ కంట్రోలర్‌, తూనికలు – కొలతల శాఖ, రాజమహేంద్రవరం

అప్రమత్తంగా ఉండాలి

తూకాల్లో మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వస్తువు కొనే సమయంలో తూకాల్లో నిబంధనలు పాటిస్తున్నారో, లేదో గమనించాలి. అధికారులు తరచూ తనిఖీలు చేసి, ప్రజలు మోసపోకుండా చర్యలు తీసుకోవాలి.

– తాడేపల్లి విజయ్‌ కుమార్‌, న్యాయవాది

ఆధారాలు భద్రపరచుకోవాలి

కొనుగోలు సమయంలో వినియోగదారులు బిల్లులు, గ్యారంటీ కార్డు, జాబ్‌కార్డు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలి. సేవా లోపం జరిగితే కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. కేసు స్వీకరించిన 90 రోజుల్లో పరిష్కారం లభించేలా కృషి చేస్తాం. రూ.5 లక్షలలోపు విలువగల కేసులు కమిషన్‌లో పూర్తిగా ఉచితం. ఆపై నిర్ణీత రుసుములుంటాయి. కమిషన్‌ వద్ద రూ.50 లక్షల వరకూ కూడా కేసులు వేయవచ్చు. వాటికి ఎంత వరకూ అయినా పరిహారం పొందవచ్చు.

– చెరుకూరి రఘుపతి వసంత్‌కుమార్‌, అధ్యక్షుడు, కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్‌–1

కూరగాయల నుంచి బంగారం

వరకూ తూకాల్లో తేడాలు

వస్తు, సేవల్లో నాణ్యతా లోపాలు

వినియోగదారుల కమిషన్లతో న్యాయం

నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే..

రాజమహేంద్రవరం ఐిసీఐసీఐ బ్యాంక్‌లో కాకినాడ రూరల్‌, రమణయ్యపేట చెందిన జంపన చంద్రశేఖర్‌వర్మ 2006లో ఇంటి రుణం తీసుకున్నారు. రుణం పూర్తిగా చెల్లించినా ఇంటి ఒరిజినల్‌ డాక్యుమెంట్లను బ్యాంకు అధికారులు తిరిగి ఇవ్వలేదు. చంద్రశేఖర్‌వర్మ 2019లో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం ఒరిజినల్‌ డాక్యుమెంట్లతో పాటు రూ.లక్ష పరిహారం, ఖర్చుల కింద రూ.8 వేలు చెల్లించాలని 2022 ఆగస్టులో కమిషన్‌ తీర్పు చెప్పింది.

అదనపు వసూలు రూ.27.. కమిషన్‌ వడ్డన రూ.27.27 లక్షలు

కాకినాడ రూరల్‌ గంగానపల్లి చెందిన నున్నా కుసుమ కల్యాణ్‌ 2023 డిసెంబర్‌ 8న హైదరాబాద్‌ బోడుప్పల్‌ ప్రాంతంలోని హోటల్‌ ట్యూలిప్స్‌ గ్రాండ్‌లో బిర్యానీలు, డ్రింకులు, మూడు మినరల్‌ వాటర్‌ బాటిళ్లు జొమాటో డైనింగ్‌ పే ద్వారా కొనుగోలు చేశాడు. వాటికి రూ.3,083 చెల్లించాడు. వాటర్‌ బాటిల్‌ ఎంఆర్‌పీ రూ.20 కాగా, ఆ హోటల్‌ నిర్వాహకులు రూ.29 వసూలు చేశారు. మూడు వాటర్‌ బాటిళ్లకు రూ.60 కాగా, అదనంగా రూ.27 కలిపి మొత్తం రూ.87 వసూలు చేశారు. దీనిపై కల్యాణ్‌ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపగా హోటల్‌ యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఆయన కాకినాడ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం కల్యాణ్‌కు రూ.25 వేల సష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చులు రూ.2 వేలు ఇవ్వాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.27 లక్షలు చెల్లించాలని గత ఫిబ్రవరి 28న కమిషన్‌ తీర్పు ఇచ్చింది.

రూ.5కు కక్కుర్తి..

రూ.5 లక్షలు పైగా వదిలింది

కాకినాడకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లి, సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ చేశారు. మొబైల్‌ డిపాజిట్‌ కౌంటర్లో సెల్‌ ఫోన్‌ పెడితే రూ.5 తీసుకోవాలి. కానీ, రూ.10 గుంజారు. దీనిపై లక్ష్మీనారాయణ కాకినాడ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయనకు రూ.5తో పాటు మానసిక ఒత్తిడికి గురైనందుకు రూ.15 వేలు, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు, అలాగే, దేవస్థానానికి మరో రూ.5 లక్షల జరిమానాను సంబంధిత కాంట్రాక్టర్‌ చెల్లించాలంటూ గత ఫిబ్రవరి 11న కమిషన్‌ తీర్పు చెప్పింది.

హక్కులకు రక్షణ కవచం1
1/3

హక్కులకు రక్షణ కవచం

హక్కులకు రక్షణ కవచం2
2/3

హక్కులకు రక్షణ కవచం

హక్కులకు రక్షణ కవచం3
3/3

హక్కులకు రక్షణ కవచం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement