
జోరుగా.. హుషారుగా ఎడ్ల పందాలు
● సీనియర్స్ విభాగంలో ధర్మవరం ఎడ్ల జత ప్రథమం ● ద్వితీయ, తృతీయ స్థానాల్లో కొవ్వాడ, జి.మేడపాడు ఎడ్లు
ప్రత్తిపాడు రూరల్: పెద్దిపాలెంలోని వైఆర్సీ కాలువ గట్టుపై నిర్వహించిన ఎడ్ల పరుగు పందాలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పరుగు పందెం పోటీలకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, ఎడ్ల పందాల అభిమానులు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. ఈ పోటీల్లో 31 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. సీనియర్స్ విభాగంలో ఏడు, జూనియర్స్ విభాగంలో 24 ఎడ్ల జతలు పాల్గొన్నాయి.
విజేతగా ధర్మవరం ఎడ్ల జట్టు
సీనియర్ విభాగంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన జువ్వల సత్తిబాబు ఎడ్ల జట్టు ప్రథమ స్థానం సాధించింది. కొవ్వాడకు చెందిన మట్టా నవనీత్ శ్రీమణికంఠ ఎడ్లు ద్వితీయ బహుమతిని, జి.మేడపాడుకు చెందిన మలిరెడ్డి అన్నపూర్ణ ఎడ్లు తృతీయ బహుమతులను కై వసం చేసుకున్నాయి. సీనియర్స్ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్న విజేతలకు వరుసగా రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.8 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. అదేవిధంగా జూనియర్ విభాగంలో కాపవరానికి చెందిన కుంచం మనోజ్ ఎడ్ల జట్టు ప్రథమ స్థానాన్ని, హుకుంపేటకు చెందిన కురుమళ్ల వీరవెంకట సత్య జైవర్థన్ ఎడ్ల జట్టు ద్వితీయ, కొవ్వాడకు చెందిన మట్టా నవీనీత్ శ్రీమణికంఠ ఎడ్లు తృతీయ స్థానాన్ని సాధించాయి. ఇందులో విజేతలకు వరుసగా రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేల నగదు, షీల్డ్‌ను ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా యనమల కృష్ణ, సిద్ధా నానాజీ, చెకూరి రామకృష్ణ వ్యవహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై లక్ష్మి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేత ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు.