‘తమ్ముళ్ల’కే కిక్కు | - | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్ల’కే కిక్కు

Mar 7 2025 12:23 AM | Updated on Mar 7 2025 12:23 AM

చక్రం తిప్పిన టీడీపీ నాయకులు

గీత కార్మికుల మద్యం షాపుల్లో వారికే అత్యధికం

రాజమహేంద్రవరం రూరల్‌: కల్లు గీత ఉప కులాలకు కేటాయించిన మద్యం షాపుల టెండర్లలో తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పారు. అత్యధిక మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. జిల్లాలో కల్లుగీత ఉపకులాలకు కేటాయించిన 13 మద్యం దుకాణాల లైసెన్సుదారుల ఎంపికకు రాజమహేంద్రవరం ఆర్‌డీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఆర్‌డీఓ కృష్ణనాయక్‌, ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌, జిల్లా అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ వినీష ఆధ్వర్యాన లాటరీ ప్రక్రియ జరిగింది. మొత్తం 387 దరఖాస్తులు రాగా, దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీడిప్‌ నిర్వహించి లైసెన్సుదారులను ఎంపిక చేశారు. మొదట మున్సిపల్‌ పట్టణ ప్రాంతం, ఆ తర్వాత సర్కిళ్ల వారీగా మండలం కేంద్రాల్లోని దుకాణాలకు లాటరీ నిర్వహించారు. ఎంపికై న మొదటి వ్యక్తి వెంటనే లైసెన్సు ఫీజు చెల్లించి దుకాణాన్ని దక్కించుకున్నారు. రెండు షాపులను మహిళలకు కేటాయించారు. రంగంపేట మండలంలో గుత్తుల వెంకటలక్ష్మి, తాళ్లపూడి మండలంలో కొప్పిశెట్టి రోజా వసంతలక్ష్మి వీటిని దక్కించుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన టెండర్లలో కూడా జిల్లాలోని 14 మంది మహిళలకు మద్యం షాపులు దక్కాయి. జిల్లాలో మొదటి విడత 125, రెండో విడత కల్లు గీత ఉపకులాలకు 13 కలిపి మొత్తం 138 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మొదటి విడతలో రూ.87.68 కోట్లు, రెండో విడతలో రూ.7.74 కోట్ల చొప్పున ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇన్‌స్పైర్‌ మనక్‌కు

100 ప్రాజెక్టుల ఎంపిక

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులకు 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 100 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి వాసుదేవరావు తెలిపారు. ఆ జాబితాను ఆయా ప్రధానోపాధ్యాయులకు పంపించామని, ఉన్నతాధికారుల సూచనల ప్రకారం ప్రాజెక్టుల ప్రదర్శన తేదీని త్వరలో ప్రకటిస్తామని వివరించారు. ఎంపికై న ప్రాజెక్టుల పాఠశాలల విద్యార్థులు, గైడ్‌ టీచర్లు ప్రదర్శనకు సిద్ధం కావాలని జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస నెహ్రూ తెలిపారు.

కూటమి సిండికేట్‌కే గీత

కార్మికుల మద్యం షాపులు

అమలాపురం రూరల్‌: జిల్లాలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపులను కూటమి సిండికేట్లే దక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 13 మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించారు. అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం మండలం, ఆలమూరు, అయినవిల్లి, ఐ.పోలవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మండపేట మున్సిపాలిటీ, ముమ్మిడివరం రూరల్‌, పి.గన్నవరం, రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం రూరల్‌ ప్రాంతాల్లోని ఈ షాపుల్లో ఒకటి గౌడ కులస్తులకు, 12 శెట్టిబలిజలకు కేటాయించి, టెండర్లు పిలిచారు. గీత కార్మికుల ముసుగులో కూటమి సిండికేట్లు ఒక్కో దుకాణానికి 5 నుంచి 15 వరకూ టెండర్లు వేశారు. మొత్తం 261 టెండర్లు దాఖలయ్యాయి. వీటికి కలెక్టరేట్‌లో జేసీ నిషాంతి, డీఆర్‌ఓ రాజకుమారి, అమలాపురం ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌కేడీవీ ప్రసాద్‌ పర్యవేక్షణలో గురువారం లక్కీ డ్రా తీసి, షాపులు కేటాయించారు.

గ్రహణం మొర్రికి

నేడు ఉచిత వైద్య శిబిరం

ముమ్మిడివరం: ఏపీ సమగ్ర శిక్ష, హైదరాబాద్‌ బసవ తారకం క్యాన్సర్‌ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యాన గ్రహణం మొర్రి, గ్రహణ శూలతో బాధ పడుతున్న చిన్నారులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకుడు షేక్‌ సలీం బాషా గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. శిబిరానికి వచ్చే చిన్నారులకు ఉచిత రవాణా ఖర్చులు ఇస్తారు. జిల్లాలోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారానికి జిల్లా సహిత విద్య కో ఆర్డినేటర్‌ మర్రెడ్డి వెంకట సత్యనారాయణను 99636 54283 మొబైల్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

నేడు 2కే రన్‌

కాకినాడ సిటీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు కాకినాడ భానుగుడి జంక్షన్‌ నుంచి సర్పవరం జంక్షన్‌ వరకూ 2కే రన్‌ నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ షణ్మోహన్‌ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళలు తదితరులు పాల్గొంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement