వినికిడి సమస్యకు సత్వర చికిత్స చేయించాలి | - | Sakshi
Sakshi News home page

వినికిడి సమస్యకు సత్వర చికిత్స చేయించాలి

Mar 4 2025 12:16 AM | Updated on Mar 4 2025 12:15 AM

రాజమహేంద్రవరం రూరల్‌: వినికిడి సమస్య ఉంటే సత్వర చికిత్స అందించాలని, తద్వారా ఈ సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా బొమ్మూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వినికిడి సమస్యతో చాలా మంది నిత్య జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వయసు రీత్యా వినికిడి లోపం వచ్చిన వారికి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పథకాల్లో భాగంగా వినికిడి యంత్రాలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎపిడమాలజిస్ట్‌ సుధీర్‌బాబు, డిప్యూటీ డెమో సత్యకుమార్‌, డాక్టర్‌ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్‌ సిలిండర్లకు

అదనపు వసూళ్లు వద్దు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వంట గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారికి 48 గంటల్లోగా సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేయాలని, ఆ సందర్భంగా అదనపు సొమ్ము డిమాండ్‌ చేయరాదని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. గ్యాస్‌ డీలర్లు, ఏజెన్సీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సిలిండర్‌ డోర్‌ డెలివరీ అనంతరం 48 గంటల్లోగా సబ్సిడీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు అకౌంట్లో పడిందో లేదో డీలర్లు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. సిలిండర్‌ డోర్‌ డెలివరీకి బాయ్స్‌ ఎక్కువ సొమ్ము డిమాండ్‌ చేయకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ మేరకు డెలివరీ బాయ్స్‌కు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. సిలిండర్‌ డెలివరీ అనంతరం రశీదులు ఇస్తున్నారో లేదో కూడా తనిఖీ చేసుకోవాలన్నారు. జిల్లాలో దీపం–2 పథకంలో 408 మంది సబ్సిడీ పొందలేదని, వారికి త్వరితగతిన సబ్సిడీ మొత్తం వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో డీఎస్‌ఓ ఎం.నాగాంజనేయులు, హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీల రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీకే రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ సెకండియర్‌

పరీక్షలు ప్రారంభం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్‌–2 పరీక్షలు జరిగాయి. జనరల్‌ విభాగంలో 18,005 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 17,777 మంది హాజరయ్యారు. 222 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా కోర్సుల పరీక్ష 1,689 మంది రాయాల్సి ఉండగా 1,634 మంది రాశారు. ఈ పరీక్షకు 55 మంది హాజరు కాలేదు. మొత్తం 55 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 37 కేంద్రాలను ఆర్‌జేడీ, డీవీఈఓ, ఆర్‌ఐఓ, డీఈసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేశాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోలేదు.

ధర్మ పరిరక్షణలో

భాగస్వాములు కావాలి

తుని: జీవాత్మకు పరమాత్మను అనుసంధానం చేసేదే ధర్మమని, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్మాత్మిక పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని కహెన్‌ షా వలీ దర్గాలో సోమవారం జరిగిన 28వ వార్షిక సర్వధర్మ సమ్మేళన సభకు ఆయన అధ్యక్షత వహించారు. సికింద్రాబాద్‌ యోగాలయ నిర్వహకుడు డాక్టర్‌ వాసిలి వసంత్‌ కుమార్‌, హిందూ ధర్మ ప్రతినిధి స్వామి విజయానంద, ఇస్లాం ప్రతినిధి సూఫీ షేక్‌ అహ్మద్‌ జానీ, క్రైస్తవ ప్రతినిధి ఎస్‌.బాలశౌరి, బౌద్ధం ప్రతినిధి పూజ్య భంతే, సిక్కు మత ప్రతినిధి గురుచరణ్‌ సింగ్‌తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి, సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో శాంతి, మానవత్వం విలువలను తెలియజేయడానికి సర్వధర్మ సమ్మేళన సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని సూచించారు. మానవత్వమే మతమని గ్రహించాలని, ఈశ్వర తత్వాన్ని పాటించాలని అన్నారు.

వినికిడి సమస్యకు సత్వర చికిత్స చేయించాలి1
1/1

వినికిడి సమస్యకు సత్వర చికిత్స చేయించాలి

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement