కాకినాడ రూరల్: విమానయాన ఇంధనం ఉత్పత్తి కాకినాడలో చేపట్టేందుకు సంబంధించిన ప్రతిపాదనపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పోర్టు కార్యాలయం వెనుక ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన సుమారు 45.8 ఎకరాల్లో రూ.2500 కోట్ల పెట్రోలియం రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలపై ఈ కార్యక్రమం నిర్వహించారు. సుస్థిర విమానయాన ఇంధనం ఉత్పత్తి ఏడాదికి 93 వేల మెట్రిక్ టన్నులు, జీవ ఇంధనం ఉత్పత్తి ఏడాదికి 352 మెట్రిక్ టన్నులు చేపట్టే ప్రతిపాదనతో మెస్సర్స్ సాఫ్ట్‌వన్ ఇండియా ఎస్‌పికాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మికులు, కుల సంఘాల పెద్దలు, దమ్ములపేట, డెయిరీ ఫారం సెంటర్ ప్రాంతాల ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. పరిశ్రమ వద్దని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా, ఉపాధి అవకాశాలు కల్పించాలని మరికొందరు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ ఈఈ సూర్యకళ, ఆర్డీవో మల్లిబాబు పాల్గొన్నారు.
సత్యదేవుని ఆలయంలో ఐదుగురికి పదోన్నతి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఈవో నల్లం సూర్యచక్రధరరావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందినవారిలో నటరాజన్ రాంజీ, మౌనికారాజ్, సందీప్ గౌడ్, పేరిందేవి, సత్యభార్గవి ఉన్నారు.
మోకాళ్లపై నిలబడి నిరసన
నిడదవోలు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో ఉండ్రాజవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) మోకాళ్లపై నిలబడి గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు పదోన్నతులు కల్పించాలని, జీతభత్యాలు పెంచాలని, నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలని పెద్ద పెట్టున నినదించారు. అనంతరం, తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం మండల శాఖ అధ్యక్షుడు తణుకు శంకరం మాట్లాడుతూ, తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. వీఆర్‌ఏల నిరసనకు వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
సర్వేల భారాన్ని తొలగించండి
పీహెచ్‌సీ ఎదుట వైద్య ఉద్యోగుల నిరసన
అడ్డతీగల: సర్వేల భారంపై గురువారం మండలం ఎల్లవరం పీహెచ్‌సీ ఎదుట వైద్య ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. అటు ప్రజలకు ఇటు వైద్య ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన సర్వేల్లో కొన్ని మార్పులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యునైటేడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.సత్యవతి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్‌ఎల్‌ఈపీ సర్వే వల్ల ప్రజలు, మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సర్వే చేసే క్రమంలో ఓటీపీ, వేలి ముద్ర విషయంలో సాంకేతిక సమస్యల వల్ల సర్వే ముందుకు సాగడం లేదన్నారు. ఈ రెండు ఆప్షన్‌లను ప్రభుత్వం తొలగిస్తే సర్వే సులువవుతుందని అన్నారు. లేదా రోజువారీ 5, 6 మందిని సర్వే చేసేలా వెసులుబాటు కల్పించాలన్నారు. నిరసన అనంతరం సంబంధిత వైద్యాధికారులకు వినతిపత్రం అందించారు.
పీహెచ్‌సీ ఎదుట నిరసన తెలుపుతున్న
వైద్య ఉద్యోగులు


