రైతన్నకు కష్టాలు, నష్టాలే.. | - | Sakshi
Sakshi News home page

రైతన్నకు కష్టాలు, నష్టాలే..

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

రావులపాలెం: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో అన్నదాతకు అన్నీ కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. గురువారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులతో నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిస్థితిపై వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. దీంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులను అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టు జగ్గిరెడ్డి స్థానిక విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లాలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీఫ్‌ సీజన్‌లో సైతం శివారు ప్రాంతాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదని జగన్‌కు వివరించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.300 కోట్లు కేటాయించామని ఇరిగేషన్‌ మంత్రి చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరిగిన పనులు మాత్రం శూన్యంగా ఉన్నాయన్నారు. కాలువల్లో నీరు వచ్చిన తర్వాత పనులు చేపట్టే ప్రయత్నం చేశారని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించారు. జిల్లాలో యూరియా సమస్య తీవ్రంగా ఉందని, 30–40 సెంట్ల భూమి సాగు చేస్తున్న కౌలు రైతులకు సైతం అవసరమైన మేరకు అందడం లేదని చెప్పారు. కొబ్బరి పంటలకు యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, క్యాబేజీ వంటి పంటలకు మూడు బస్తాలు అవసరమైతే కేవలం అర బస్తా మాత్రమే అందుతున్న పరిస్థితి ఇక్కడ ఉందని తెలిపారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం, కరెంటు కోతలు, కంద వంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడంతో రైతులపై ఆర్థిక భారం మరింత పెరిగిందన్నారు. మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవితం భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి కరువు మండలాలను ప్రకటించాలని, రైతులకు అవసరమైన ఉపశమన చర్యలు అందించాలని, రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని జగ్గిరెడ్డి కోరారు.

శివారుకు సాగునీరందడం లేదు

యూరియా కొరతతో

అన్నదాతకు అష్టకష్టాలు

కౌలు రైతులు, కొబ్బరి, కూరగాయల

రైతులకూ తీవ్ర ఇబ్బందులు

ఎరువుల ధరలు, విద్యుత్‌ కోతలు,

గిట్టుబాటు ధర లేకపోవడంతో

పెరుగుతున్న ఆర్థిక భారం

వైఎస్సార్‌సీపీ అధినేతకు

వైఎస్‌ జగన్‌కు వివరించిన జగ్గిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement