అమలాపురం టౌన్: కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే సహజ వాయువు (గ్యాస్)ను 50 శాతం మేర రాష్ట్ర ప్రజల అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేస్తూ జన విజ్ఞాన వేదిక (జేవీవీ) అమలాపురంలో శనివారం సాయంత్రం ర్యాలీ చేపట్టింది. జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షుడు జనుపల్లి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీవీ వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో జేవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, రాష్ట్ర జేవీవీ నాయకులు మురళీధర్, గిరిధర్, జి.ఈశ్వరరావు, జీఎస్‌హెచ్‌పీ వర్మ, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కారెం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని గ్యాస్ కోసం నినాదాలు చేశారు. కూచిమంచి అగ్రహారంలోని యూటీఎఫ్ హోమ్ నుంచి మొదలైన ర్యాలీ బ్యాంక్ స్ట్రీట్ మీదుగా గడియారం స్తంభం సెంటర్‌కు చేరుకుంది. కాలుష్యం వల్ల నష్టపోతున్న మత్స్యకారులు, సన్నకారు రైతులకు జీవన భద్రత కల్పించాలని, కొబ్బరి చెట్లు, స్థానిక పంటల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆక్వా చెరువుల తవ్వకాలను నిలుపుదల చేయాలని, తీర ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.


