● రాజధానిపై అసెంబ్లీ తీర్మానం ఒక డ్రామా
● లోకేష్‌ను ప్రపంచ కుబేరుడిని చేయాలనే తపన
● కూటమి ప్రభుత్వం అస్థిత్వం కోల్పోయింది
● ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
రావులపాలెం: అసెంబ్లీలో రాజధాని తీర్మానం పేరుతో చంద్రబాబు చేసిన హంగామా వెనుక రూ.లక్ష కోట్ల కుంభకోణం దాగి ఉందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన గురుతర బాధ్యత తమపై ఉందన్నారు. రావులపాలెంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన రాజధానికి ఇప్పుడు తీర్మానం చేయడం వెనక పెద్ద స్కామ్ ఉందన్నారు. బాబు రాజధాని పేరుతో జరిపే అవినీతికి తమ పార్టీ వ్యతిరేకమన్నారు. 50వేల ఎకరాలు సేకరించి రైతులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చేందుకే తీర్మానమనే నాటకం ఆడుతున్నారన్నారు. 2014–2019 మధ్య సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు తీర్మానం చేయలేదని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. రాజధాని కోసమంటూ మరో 50 వేల ఎకరాలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో సేకరించేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటన్నారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు బాబు ఈ తీర్మానం చేస్తున్నారన్నారు. ఈ లక్ష కోట్లలో ప్రతి అంగుళం అవినీతి ఉంటుందన్నారు.
రైతులను నట్టేట ముంచారు
గతంలో 50 వేల ఎకరాలు సేకరించి, ఆ రైతులకు ప్లాట్లు ఈరోజు వరకు కేటాయించకుండా నట్టేట ముంచారని ఆయన విమర్శించారు. కొంతమంది రైతులకు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, మరికొంతమందికి ఉన్న ప్లాట్లకు రోడ్లు లేవు, కొంతమందికి చెరువుల్లో ఉన్న ప్లాట్లకు బోట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులున్నాయన్నారు. ఒకపక్క రైతులను మోసం చేస్తూ మరోపక్క లోకేష్‌ను ప్రపంచ కుబేరుడిని చేయడానికి రాజధాని పేరుతో ల్యాండ్ ఫూలింగ్‌కు పన్నాగం పన్నారన్నారు. గతంలో ఇచ్చిన రైతులకే న్యాయం చేయని బాబు కొత్తగా రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీని సమావేశ పరిచిన సమయంలోనే మండలిని కూడా సమావేశ పర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై లేదా అని ప్రశ్నించారు. రాజధానిని మంత్రి నారాయణ సెల్ఫ్ ఫైనాన్సింగ్‌గా చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన భూములకు రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేసినట్టుగా చూపిస్తున్నారన్నారు. ఇందులో రూ.2,000 కోట్లు కేంద్రం ఇస్తే, రూ.3,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారన్నారు. రాజధాని తీర్మానం కోసమని అసెంబ్లీని సమావేశపరచి అదేమీ మాట్లాకుండా జగన్ కోసం మాట్లాడటం సిగ్గు చేటన్నారు. జగన్ చేసిన ప్రకటనపై బాబు, పవన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
ప్రజల సొమ్ము కమీషన్ల రూపంలో జేబులోకి..
అత్యంత నాణ్యమైన ఆధునికమైన నిర్మాణాలు చేపట్టడానికి చదరపు అడుగుకు రూ.2,000 అవుతుంటే కేవలం కమీషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు చదరపు అడుగుకు రూ.11,000 ఖర్చు చేస్తున్నారన్నారు. చివరకు ఆ కాంట్రాక్టులను కూడా తన బినామీలకు దోచిపెడుతున్నారన్నారు. చెరువుల్లో రాజధానిని నిర్మిస్తూ అది మునిగిపోతే మళ్లీ ఆ నీరు తోడేందుకు తన బినామీలకే కాంట్రాక్టులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. 2014లో రాజధాని డిజైన్ల పేరుతో రూ.400 కోట్ల కాంట్రాక్ట్‌ను సింగపూర్ కంపెనీకి ఇచ్చి దగా చేసి, ఇప్పుడు మళ్లీ రూ.700 కోట్లు డిజైన్ల పేర్లతో తన బినామీ కంపెనీలకు కట్టబెడుతూ ప్రజల సొమ్మును దోచేస్తున్నారన్నారు. రోడ్లకు కిలోమీటరుకు రూ.2.50 కోట్లు నేషనల్ హైవే సంస్థ ఖర్చు పెడుతుంటే రాజధానిలో రోడ్లు వేసేందుకు కిలోమీటరుకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తూ ప్రజల సొమ్మును కమీషన్ రూపంలో జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు.
మీ అవినీతిని జనంలోకి తీసుకొచ్చింది జగనే
ప్రజల సొమ్ముతో ఏర్పాటవుతున్న 11 మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అమ్మేసుకోవాలనే ప్రయత్నాన్ని.. మీరు అన్న ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రజల్లోకి తీసుకువచ్చి ప్రశ్నించారన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించని మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు ఇస్తా అన్న సబ్సిడీ రూ.20,000 మాత్రమే ఇచ్చి, మరో రూ.60,000కు ఎగనామం పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 2019లో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించడం వల్లే సంక్షేమం, రైతులకు గిట్టుబాటు ధర, రైతు భరోసాతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారం చేసే మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. మహిళలకు, బలహీన వర్గాల మహిళలకు నెలకు ఇస్తామన్న ఆర్థిక సాయం మాట ఏమైందన్నారు. జగన్ ఐదేళ్లలో సంక్షేమ పథకాల కోసం అప్పు చేస్తే చంద్రబాబు జేబులు నింపుకునేందుకు రూ.మూడు లక్షల 31 కోట్లు అప్పు చేశారన్నారు. రాజధానికి వ్యతిరేకమని జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఉన్న రాజధానిలో రాజ్యాంగబద్ధంగా బిల్డింగులు నిర్మించి, విశాఖ సాఫ్ట్‌వేర్ హబ్‌గాను, కర్నూలును జ్యుడీషియల్ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా అభివృద్ధి సమతుల్యతను జగన్ ఆకాంక్షించారన్నారు.


