రాజకీయ నిరుద్యోగులకు అవార్డులే! | - | Sakshi
Sakshi News home page

రాజకీయ నిరుద్యోగులకు అవార్డులే!

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

సాక్షి, అమలాపురం: పార్లమెంట్‌.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు పదవీ యోగం కల్పించనుండగా... మున్సిపల్‌ వార్డుల విభజన పట్టణాలు.. నగర పంచాయతీల పరిధిలో ద్వితీయశ్రేణి నాయకుల పదవీ కాంక్షలను నెరవేర్చనుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వార్డుల సంఖ్య పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా కోరింది. దీంతో జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో సుమారు 16 నుంచి 20 వరకు వార్డులు పెరిగే అవకాశముంది. కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీ ఉన్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రమైన అమలాపురంలో 30 వార్డులున్నాయి. రామచంద్రపురంలో 28 వార్డులు, ముమ్మిడివరం నగర పంచాయతీలో 20 వార్డుల వరకు ఉన్నాయి. ఈ మూడుచోట్లా కలిపి మొత్తం 78 వరకు వార్డులున్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వార్డుల సంఖ్య పెంచితే 16 నుంచి 20 వార్డుల వరకు పెరిగే అవకాశముందని అంచనా.

జిల్లా కేంద్రమైన అమలాపురంలో మొత్తం 30 వార్డులున్నాయి. ఇక్కడ జనాభా సుమారు 65 వేల మంది. ఇప్పుడు బూత్‌కు 600 నుంచి 1,000 ఓట్లు వరకు (వార్డుకు 1,300 నుంచి 1,500 ఓట్లు) ఉన్నాయి. పట్టణాన్ని ఆనుకుని ఉన్న పంచాయతీలలోని శివారు ప్రాంతాలను విలీనం చేయడం, ప్రతి వెయ్యి మందికి అటూఇటూ ఓటర్లకు ఒక వార్డు చొప్పున కేటాయించినా సుమారు 40 వార్డులు అవుతాయి. ఈ మేరకు మున్సిపల్‌ అధికారులు పట్టణాభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు సైతం పంపించారు. ఇక రామచంద్రపురం మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. జనాభా సుమారు 49,500 మంది వరకు ఉన్నారు. వార్డుకు ప్రస్తుతం వేయి నుంచి 1,200 మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఒక వార్డులో అయితే 1,400 మంది ఓటర్లు ఉన్నారు. ఏడు గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉన్నా అది ఆచరణకు నోచుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వేయి మందికి ఒక వార్డు చొప్పున కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఈ పట్టణంలో నాలుగు నుంచి ఆరు వార్డులు పెరగనున్నాయి. దీంతో మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 32 నుంచి 34కు చేరనుంది. ముమ్మిడివరం నగర పంచాయతీలో జనాభా సుమారు 22 వేల మంది కాగా మొత్తం 20 వార్డులున్నాయి. వార్డుకు 900 నుంచి 1,300 మంది వరకు ఓటర్లున్నారు. ఇక్కడ రెండు నుంచి నాలుగు వార్డులు పెరుగుతాయని అంచనా. పెరగనున్న వార్డుల సంఖ్య పట్టాణాల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల ద్వితీయశ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

విలీనాలకు అన్నీ అవాంతరాలే..

అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో శివారు గ్రామాల విలీన ప్రతిపాదనలు రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనల దశలోనే ఆగిపోతున్నాయి. అమలాపురం మున్సిపాలిటీలో బండారులంక, ఈదరపల్లి, కామనగరువు, పేరూరు, జనుపల్లి, వేమవరం, వేమవరప్పాడు, నడిపూడి, చిందాడగరువు, రోళ్లపాలెం, భట్నవిల్లి గ్రామాలను, గ్రామాల శివారు ప్రాంతాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉంది. పట్టణాన్ని ఆనుకుని మూడు కిలోమీటర్ల పరిధిలో పంచాయతీల విలీన ప్రతిపాదనలకు అన్నీ అవాంతరాలే. ఆయా పంచాయతీలు కోర్టులను ఆశ్రయించడం, స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఇది ముందుకు సాగడం లేదు. రామచంద్రపురం మున్సిపాలిటీలో ఏడు గ్రామాల విలీన ప్రతిపాదనపై కూడా ఏళ్ల తరబడి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పసలపూడి, ఏరుపల్లి, తాళ్లపొలం, ఉట్రుమిల్లి, యనమదల, చోడవరం, నర్సారావుపేట పంచాయతీలను విలీనం చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా స్థానికులు అంగీకరించడం లేదు. తాజాగా రాయవరం మండలంలోని పసలపూడి తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, జిల్లాలోని కొత్తపేట, రావులపాలెం, రాజోలు, మలికిపురం, తాటిపాకలను నగర పంచాయతీలుగా చేయాలనే ప్రతిపాదన ఉన్నా ఆయా పంచాయతీలు అంగీకరించకపోవడం గమనార్హం.

మున్సిపాలిటీలలో పెరగనున్న వార్డుల సంఖ్య

జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ

ఇప్పుడున్న వార్డులు 78

పెరగనున్నవి 16 నుంచి 20 వరకు

అమలాపురం మున్సిపాలిటీలోనే

పది వరకూ పెరిగే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement