మూడో రోజూ చూడముచ్చటగ.. | - | Sakshi
Sakshi News home page

మూడో రోజూ చూడముచ్చటగ..

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

వైభవంగా వెంకన్న కల్యాణోత్సవాలు

పొన్న వాహనంపై ఉభయ దేవేరులతో ఊరేగిన స్వామివారు

ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు మూడో రోజు సోమవారం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి మేలుకొలుపు, తీర్థపు బిందె తెచ్చుట, విశేషార్చన, నిత్య హోమాలు, బలిహరణము, ద్రవిడ వేద పారాయణ, నీరాజన మంత్రపుష్పములు నిర్వహించారు. సాయంత్రం 6.02 గంటల నుంచి ప్రధాన హోమాలు, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు నిర్వహించారు. 7.02 గంటలకు ఉభయ దేవేరులతో స్వామివారికి పొన్న వాహన సేవ, మాడవీధులలో మేళ తాళాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బ్యాండ్‌ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ భారీ సంఖ్యలో భక్తుల గోవింద నామస్మరణలతో అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. తీర్థ, ప్రసాద వితరణ చేశారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు, ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

భక్తుల కోసం సోలార్‌ లైట్ల ఏర్పాటు

వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా వెలుగులు అందించేందుకు అధికారులు సోలార్‌ లైట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊబలంక శిరిడి సాయి ఆలయం నుంచి మెర్లపాలెం మీదుగా వాడపల్లి వరకు రహదారిలో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేశారు. సుమారు రూ.4 లక్షల వ్యయంతో 20 సోలార్‌ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఈవో సూర్యచక్రధరరావు తెలిపారు. ఆయన సోలార్‌ లైట్ల ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement