కొంగు బంగారు.. భక్తి పొంగారు.. | - | Sakshi
Sakshi News home page

కొంగు బంగారు.. భక్తి పొంగారు..

Mar 27 2026 9:21 AM | Updated on Mar 27 2026 9:21 AM

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వైభవంతో

అలరారుతున్న వాడపల్లి క్షేత్రం

‘ఏడు వారాల వెంకన్న దర్శనం.. ఏడేడు

జన్మల పుణ్యఫలమ’ని భక్తుల విశ్వాసం

ప్రతీ శనివారం లక్షలాదిగా

తరలివస్తున్న భక్త జనం

రేపటి నుంచి వచ్చే నెల 3 వరకు

స్వామివారి కల్యాణోత్సవాలు

కొత్తపేట/ఆత్రేయపురం: తిరుపతి, ద్వారకా తిరుమల తరువాత అత్యంత భక్తజనాదరణ పొందిన పుణ్యక్షేత్రంగా అనతికాలంలోనే వాడపల్లి ప్రసిద్ధి చెందింది. గౌతమీ – వశిష్ట గోదావరి నదుల నడుమ, పచ్చని పంట పొలాల మధ్య గల వేంకటేశ్వరస్వామి వెలసిన ఈ గ్రామం వాడపల్లి. దీనికి కొద్దిదూరంలోనే విజ్జేశ్వరం సమీపంలో మరో వాడపల్లి ఉన్నందున, లొల్ల గ్రామానికి ఆనుకొని ఉండటంతో లొల్ల వాడపల్లి, చిన్న వాడపల్లిగా పిలిచేవారు. కొన్ని సంవత్సరాల్లోనే భక్తుల విశ్వాసం చూరగొన్న ఈ వాడపల్లి కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ‘ఏడు వారాల వెంకన్న దర్శనం – ఏడేడు జన్మల పుణ్యఫలం’ అనే విశ్వాసంతో ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు వస్తున్నారు. ఏడు ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. శనివారం భక్తుల తాకిడి విపరీతంగా పెరిగి, ప్రదక్షిణలకు, స్వామి దర్శనానికి ఇబ్బందిగా మారడంతో కొందరు మిగిలిన ఆరు వారాల్లో ఏదో ఒకరోజును ఎంచుకుంటున్నారు. అదే రోజున ఏడు వారాలపాటు వచ్చి ఏడు చొప్పున ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా అన్ని రోజులూ మొక్కుబడులు తీర్చుకోవడానికి జనం వస్తుండడంతో ఈ క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది.

స్థల పురాణం

ఇక్కడి దేవాలయంలోని మూర్తి ధారుమూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడ గల శిలాఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉంది... వైకుంఠంలో ఒకసారి మహర్షులు నారాయణుని దర్శించుకునేందుకు వచ్చి భూలోకమున పాపం, అధర్మం, అన్యాయం పెరుగుతున్నవి వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకొన్నారు. అప్పుడు విష్ణువు వారితో అధర్మం ప్రబలినపుడు నేను అనేక రూపాలలో అవతరించాను. కలియుగంలో అచ్చాస్వరూపుడనై గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలుస్తాను. ఆ మేరకు లక్ష్మీసహితంగా ఒక చందన పేటికలో నౌకాపురి చేరుకొంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. ఆ ప్రకారం కలియుగంలో సుమారు 400 సంవత్సరాల క్రితం గౌతమీ నదీ తీరాన వున్న నౌకాపురి తరువాత ఓడపల్లి (నేటి వాడపల్లి) ఋషి పుంగవులతో తపోవనంగా విరాజిల్లేది. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలిచేవారు. రక్త చందనం రూపంలో గోదావరిలో స్వామివారి విగ్రహం ఉన్నట్టు భక్తులకు ఋషులు కలలో చెప్పారు. ఆ కొయ్య విగ్రహాన్ని బయటకు తీసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగించి ఏటి ఓడ్డున ప్రతిష్టించారు. దేవర్షి నారదుడు కూడా వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టామహోత్సవంలో పాల్గొన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచి పూజలు అందుకుంటున్న కోనేటి రాయుడిని ప్రస్తుతం పూజలందుకుంటున్న చోట తిరిగి పునః ప్రతిష్ఠించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

550 ఎకరాలు స్వామివారికి విరాళం

ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే సంపన్న వ్యాపారి 1759వ సంవత్సరంలో నిర్మించారు. గజేంద్రుడికి స్నేహితుడు, ప్రాంతీయ పరిపాలకుడైన పెద్దాపురం మహారాజు రాజా వత్సవాయి తిమ్మ జగపతిరాజు అప్పట్లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణకు 275 ఎకరాల భూమిని విరాళంగా సమకూర్చారు. దీప ధూప నైవేద్యాల కోసం 110 ఎకరాలు, స్వామి వారి సేవల నిమిత్తం 165 ఎకరాల భూమి సమర్పించారు. విరాళంగా ఇచ్చిన భూములను అర్చక మాన్యాలు, రజక, మంగలి, సన్నాయి, ధూపదీప నైవేద్యం మాన్యాల కింద విడదీసి స్వామి వారికి సర్వ హక్కులు కల్పించారు. ఆ భూములపై వచ్చే ఆదాయంతో వీరంతా జీవనం సాగిస్తూ స్వామి వారికి సేవలు అందిస్తున్నారు.

ఏడు వారాల దర్శనంతో..

ఈ ఆలయాన్ని దేవదాయ శాఖ అధీనంలోనికి తీసుకున్న అనంతరం కొంతకాలం పాటు సేవలు అంతంత మాత్రంగానే కొనసాగించారు. ఇటీవల స్వామిని దర్శించే వారి సంఖ్య విశేషంగా పెరిగింది. దేవస్థానం ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి శనివారం సుమారు రూ.55 లక్షలకు పైబడి ఆదాయం సమకూరుతోంది.

వైఎస్సార్‌ సీపీ హయాంలో అభివృద్ధి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునందుకుని దాతలు, కాంట్రాక్టర్లు ఈ క్షేత్రం అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆలయ ఆవరణలో గోశాల, భారీ రేకు షెడ్లు, అన్నదాన భవనం నిర్మించారు. రూ.55 కోట్లతో ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి ప్రభుత్వానికి పంపారు. రూ.5.5 కోట్లతో వకుళమాత అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేస్తున్నారు. రూ.65 లక్షలతో శాశ్వత వార్షిక కల్యాణ వేదికను ఊబలంక, రావులపాలెం కాంట్రాక్టర్లు నిర్మించారు. రూ.22 లక్షలతో తాగునీరు వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు.

29న స్వామి కల్యాణం

ఈ క్షేత్రంలో చైత్రశుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది శనివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. 28 న అంకురార్పణ, ధ్వజారోహణం, 29న కల్యాణం, రథోత్సవం, 30న పొన్నవాహనంపై గ్రామోత్సవం, 31న సదస్యం, ఏప్రిల్‌ 1న జల విహారోత్సవం, 2న చక్రస్నానం, 3న పుష్పోత్సవం నిర్వహిస్తారు.

వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం

శ్రీవేంకటేశ్వర స్వామివారు

అన్ని ఏర్పాట్లూ చేశాం

గత కల్యాణోత్సవాల కంటే మించి భక్తుల సంఖ్య పెరుగుతుందనే అంచనాలతో ఏర్పాట్లు చేశాం. కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పాలకమండలి చైర్మన్‌ ముదునూరి వెంకట్రాజు, ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించాం.

– నల్లం సూర్యచక్రధరరావు,

దేవదాయ శాఖ డీసీ, ఆలయ ఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement