అమలాపురం రూరల్: నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా క్షయ రోగులు త్వరగా కోలుకోవడానికి పౌష్టికాహారం అందజేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి పిలుపు నిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ టీబీ నిర్మూలనలో భాగంగా భారత ప్రభుత్వం రోగులకు ఆర్థిక, పోషకాహార మద్దతు అందించడానికి పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. పేదరికం కారణంగా ఆహారం సరిగ్గా తీసుకోలేని రోగులకు సహాయం చేయడానికి నిక్షయ్ పోషణ్ యోజనను ప్రారంభించారన్నారు. ప్రతి టీబీ రోగికి చికిత్స కొనసాగినంత కాలం నెలకు రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ మొత్తం నేరుగా రోగి ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతాకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేయబడుతుందన్నారు. ఈ డబ్బుతో రోగులు పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు వంటి బలవర్థకమైన ఆహారాన్ని కొనుగోలు చేసి పోషకాహారాన్ని పొందాలన్నారు. దాతలు, వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు టీబీ రోగులను దత్తత తీసుకుని అందించిన పోషకాహార కిట్లను జేసీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. టీబీ ముక్త సిల్వర్ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ దుర్గారావు దొర, అదనపు డీఎంహెచోవో సీహెచ్‌వీ భరతలక్ష్మి, డాక్టర్ల సుమలత, విజయేంద్ర, డీసీహెచ్ ఎస్.కార్తిక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


