ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే..
● శ్రీవారి లడ్డూలో కల్తీ అంటూ భక్తుల
మనోభావాలను దెబ్బతీస్తున్నారు
● వైఎస్సార్ సీపీ యువజన
విభాగం జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్
రామచంద్రపురం: శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహాపాపం చేస్తున్నారని, ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ అన్నారు. కూటమి నేతలు శ్రీవారి భక్తులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని గాంధీపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసమే సీఎం చంద్రబాబు దుష్ప్రచారానికి పాల్పడ్డారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని కోర్టుకు సీబీఐ నివేదిక ఇవ్వటంతో రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు అంబటి రాంబాబుపై దాడికి పాల్పడి, అక్రమ అరెస్టులకు తెర లేపారన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రమే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఘటనలు జరుగుతున్నాయన్నారు. విజయవాడలోని అమ్మవారి ఆలయంలో విద్యుత్‌ను నిలిపివేయటం, సింహాచలంలో భక్తులు క్యూలో మృతి చెందటం వంటివి భక్తుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. తాజాగా శ్రీశైలంలో మాలధారణతో స్వామివారి దర్శనానికి వచ్చిన శివస్వాములపై పోలీసులు లాఠీచార్జీ చేయడం ఈ ప్రభుత్వం దమనకాండకు నిదర్శనమన్నారు.
సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పుకునే ఈ కూటమి నేతలు భక్తులపై దౌర్జాన్యాలకు దిగుతున్నారని విమర్శించారు. తిరుమల శ్రీ వారి సన్నిధిలోని మహా ప్రసాదంపై కూటమి ప్రభుత్వం అబద్దాలు చెబుతూ మహా అపచారం చేస్తోందని, ఇకనైనా శ్రీవారి లడ్డూపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని, లేకుంటే వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి కూటమి నేతలు గురికాక తప్పదన్నారు. తొలుత పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం ఇతర కూటమి నేతలు కలిసి పెద్ద ఎత్తున మీడియా సమావేశం పెట్టి శ్రీవారి లడ్డూ వివాదంపై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్టీ పట్టణ, మండల కన్వీనర్‌లు గాధంశెట్టి శ్రీధర్, పెట్టా శ్రీనివాసరావు, పోలినాటి వరప్రసాద్, సర్పంచ్‌లు చిల్లే నాగేశ్వరరావు, పెంకే వీరరాఘవులు, కౌన్సిలర్‌లు కేతా శ్రీను, గుబ్బల గణ, పార్టీ నేతలు పెంటపాటి శ్రీను, యాళ్ల సత్తిబాబు, పోతంశెట్టి గోపాలకృష్ణ, కోటిపల్లి శివాజీ, గుంటముక్కల దొరబాబు, కూళ్ల చిన్ని, కొయ్యా బంగారుబాబు పాల్గొన్నారు.


