గంటి కేసులో కొత్తపేట పోలీసులపై చర్యలకు వినతి
అమలాపురం రూరల్: గంటి గ్రామంలో దళిత యువకులపై మారణాయుధాలతో విచక్షణారహితంగా కొంతమంది దాడి చేశారని, గాయపడిన ఆ యువకులను ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా కొత్తపేట పోలీసులు ఆలమూరు స్టేషన్‌కు తీసుకెళ్లి అమానుషంగా కొట్టారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కలెక్టర్ మహేష్‌కుమార్‌కు మంగళవారం అందించారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్‌కు వివరించారు. ఎస్.ఐ. సురేంద్ర నిందితులపై సరైన సెక్షన్లు నమోదు చేయకుండా, బాధితులపైనే కేసులు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, హింసకు పాల్పడి, బాధితులతో మూత్రం తాగించిన ఎస్‌ఐ, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి, నేషనల్ ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మోహన్‌కుమార్ ధర్మా, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవాక సుబ్బారావు ఏపీ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది మర్రి బాబ్జి, మాల మహానాడు జిల్లా నాయకులు జక్కల అరుణ్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వర రావు, శెట్టిబతుల తులసీరావు, మోకా శ్రీను కలెక్టర్‌ను కలిశారు.
కలెక్టర్‌కు వివరాలు అందించిన
నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు


