పూరీలు చేయలేకపోతున్నాం
రాజోలు: తెల్లవారుజామునే తమతో పూరీలు చేయిస్తున్నారని, దీంతో నిద్ర సరిపోవడం లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ వద్ద శివకోటి గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం శివకోటి గురుకుల బాలిక పాఠశాలను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినులతో మాట్లాడారు. తమకు వడ్డిస్తున్న కూరలు రుచిగా ఉండడం లేదని, చికెన్ పీసులు తక్కువ వేస్తున్నారని తెలిపారు. కాగా.. తనిఖీల్లో భాగంగా పాడైపోయిన కూరగాయలు, చిక్కీలను ఆయన గుర్తించారు. విద్యార్థినులతో పూరీలు చేయించడంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే కూనవరం జెడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.


