భక్తవత్సలా.. నిత్యనిర్మలా..
● మార్మోగిన గోవింద నామస్మరణ
● వాడపల్లికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంతో పాటు దేవస్థానానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారికి అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించి, భక్తులను దర్శనాలకు అనుమతించారు. దేవదాయశాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా..
ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, మాడ వీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు లక్షమందికి పైగా భక్తులు విచ్చేసినట్టు ఆలయ చైర్మన్ ఎం.వెంకటరాజు, ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం సీఐలు సీహెచ్ విద్యాసాగర్, శేఖర్ బాబు, ఎస్‌ఐ ఎస్.రాము, సిబ్బంది వాడపల్లిలో ట్రాఫిక్‌ను నియంత్రించారు. అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్వామివారి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. ఆత్రేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది మూర్తి ఆలయ ఆవరణలోని నడింపల్లి రాజేశ్వరీదేవి మంటపంలో వైద్య శిబిరం, ఈవో పర్యవేక్షణలో మరో వైద్య శిబిరం నిర్వహించారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
భక్తవత్సలా.. నిత్యనిర్మలా..


