వక్ఫ్‌బోర్డు భూములపై చంద్రబాబు కుట్ర
● ప్రభుత్వ భూములుగా
మార్చేందుకు యత్నాలు
● వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ ఆగ్రహం
అమలాపురం టౌన్: రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూములను చంద్రబాబు ప్రభుత్వం క్రమేపీ ప్రభుత్వ భూములుగా మార్చేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోందని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. దీనిలో భాగంగానే మంగళగిరిలోని 71.57 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వం చట్టబద్ధత పాటించకుండా నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు రెవెన్యూ ఆన్‌లైన్ రికార్డుల్లో పభుత్వ భూములుగా మార్చిందన్నారు. ఈ మేరకు ఆయన శనివారం అమలాపురంలో ప్రకటన విడుదల చేశారు. మంగళగిరిలోని 71.57 ఎకరాలకు అటు వక్ఫ్ బోర్డు గానీ, ఇటు ఆ భూములను పర్యవేక్షిస్తున్న అంజుమన్–ఇ–ఇస్లామియా సంస్థ గానీ ఎలాంటి అనుమతులు ఇవ్వకుండానే ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదే తరహాలో మంగళగిరి ప్రాంతానికి సమీపంలోని మల్లయ్యపాలెంలో గల 232 ఎకరాల వక్ఫ్ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోకి ఈ వక్ఫ్ భూములను తీసుకుని వచ్చి టీడీపీ అనుకూల వర్గాలకు కేటాయించే ప్రయత్నం చాపకింద నీరులా జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్ర వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతున్న క్రమంలో రాష్ట్రంలోని ముస్లిం సోదరులు ఈ విధానాన్ని వ్యతిరేకించాలని ఖాదర్ విజ్ఞప్తి చేశారు.
రేపు కలెక్టర్‌కు ఫిర్యాదు
వక్ఫ్ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటున్న ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అమలాపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఖాదర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మైనార్టీ సోదరులు ఆ రోజు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌కు తరలిరావాలని పిలుపునిచ్చారు.


