దొంగే దొంగ అన్నట్టు!
● తమ్ముళ్ల కబ్జాలో పర్ర భూములు
● ఆక్రమణలు తొలగించాలంటున్న
అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు
● అధికారంలో ఉండి చర్యలు తీసుకోకపోగా
నిరసనలు ఏమిటని ప్రశ్నిస్తున్న రైతులు
● గత ప్రభుత్వంలో ఆక్రమణల
తొలగింపునకు అనుమతులు
● స్వయంగా సమీక్షించిన నాటి సీఎం జగన్
● ఎన్నికలు రావడంతో చర్యలు పక్కకు
● పర్యవసానంగా సాగునీటికి అవరోధం
● ఏటా అన్నదాతలకు తప్పని తిప్పలు
సాక్షి, అమలాపురం: ‘జిల్లాలో మురుగునీటి కాలువలలో తూడు, గుర్రపు డెక్క తొలగింపునకు గత ఏడాది ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేసింది. కాని గోదావరి మధ్య డెల్టా ప్రాజెక్టు కమిటీలో కీలక టీడీపీ నేత ఒకరు మొత్తం పనులు చేస్తానని పనులు చేయకుండా వదిలేశారు. గత ఏడాది భారీ వర్షాలు.. గోదావరికి ఐదుసార్లు వచ్చిన వరదలు.. మోంథా తుపాను వల్ల సుమారు 77 వేల ఎకరాల్లో వరి పంట నష్టానికి ఇదే ప్రధాన కారణం. అయినా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నోరు మెదపలేదు. పనులు పూర్తి చేయలేదు’.
కాలం కాని కాలంలో జిల్లాలో సహజ సిద్ధంగా ఏర్పడిన పర్ర భూములు (సాంప్)లు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తక్షణం తొలగించాల్సిందేనని టీడీపీ అనుబంధ కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద పర్ర భూములలో ఆక్రమణల తొలగించాలని రైతులు ధర్నాకు దిగడం.. ఇందుకు అధికార పార్టీకి చెందిన అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు వచ్చి సంఘీభావం తెలపడం తెలిసిందే. వారిని చూసి విస్తుపోయిన రైతులు అధికారం చేతిలో ఉన్నవారు సాంప్‌లలో ఆక్రమణలు తొలగించడం మానేసి ఇలా ధర్నాలకు దిగడమేమిటని ప్రశ్నిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే పర్ర భూముల కబ్జాదారులలో అధికంగా టీడీపీ అనుకూలురే కావడం గమనార్హం.
గోదావరి డెల్టాలో ప్రస్తుతం రబీ సాగులో ఉంది. శివారుకు నీరందక జిల్లాలో నాట్లు ఆలస్యమవుతున్నాయి. మరీ ముఖ్యంగా సాగు ఆలస్యమవుతోంది. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలోనే ఈ విషయమై మాట మాత్రమైనా స్పందించని ఇద్దరు ఎమ్మెల్యేలు పర్ర భూమి ఆక్రమణలపై స్పందించడం గమనార్హం. పర్ర భూములలో ఆక్రమణలు తొలగించాలని తీర మండలాల రైతులు దశాబ్దాలుగా కోరుతున్నారు.
పులికాట్... కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన వృద్ధ గౌతమీ నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకు సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయని అంచనా. వీటిని ఆనుకుని రామేశ్వరం, కూనవరం మొగలు ఉండగా, వీటి ద్వారా ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన 40 వేల ఎకరాల ఆయకట్టు ముంపునీరు సముద్రంలో చేరుతోంది. మొగలు తెరుచుకోకపోవడం, పర్ర భూముల ఆక్రమణల వల్ల రైతులు ఏటా సుమారు రూ.60 కోట్ల విలువైన పంటను కోల్పోతున్నారు.
మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూములలోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్ర యానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమోగ వద్ద గౌతమీ నదీపాయలో కలిసి అక్కడ నుంచి సముద్రంలోకి వెళ్లేది. దీని వల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపుబారిన పడినా రెండు, మూడు రోజుల్లో నీరు తీసేది. పర్రభూముల్లో ఆక్వా చెరువులు పెద్ద ఎత్తున వచ్చాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్ర యానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాలు అక్రమంగా ఆక్వాసాగవుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడడంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్రభూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మెడ్రాస్ కన్జెర్వెన్సీ చట్టాలను తోసిరాజని పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వుతున్నా... వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు.
తొలగింపునకు కమిటీలు
పర్ర భూములలో కబ్జాల తొలగింపునకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆయకట్టు రైతులు, రైతు సంఘాలు, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ నుంచి వెళ్లిన విజ్ఞాపనలపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా స్పందించి సమీక్షించారు. పర్ర భూములను సర్వే చేయించడంతో పాటు ఆక్వా చెరువులు తొలగించాలని నిర్ణయించారు. మండల స్థాయిలో తహసీల్దార్, మత్స్యశాఖ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర ఫిషరీష్ కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ సమయంలో ఎన్నికలు రావడంతో సర్వే, కబ్జాల తొలగింపు పక్కకు పోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సర్వే చేసి తొలగింపు చర్యలు చేపట్టవచ్చు. చంద్రబాబు సర్కార్ కొలువుదీరి 19 నెలలు కావస్తోంది. కాని ఇంత వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. స్థానిక ఎమ్మెల్యేలు శాసనసభలోను, ప్రభుత్వం వద్ద ఈ విషయాన్ని లేవనెత్తి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై ఒత్తిడి చేసి ఉంటే ఇప్పటికే పర్ర కబ్జాల బారి నుంచి బయటపడేది. కాని ఇవేమీ చేయకుండా అధికారంలో ఉండి కూడా ధర్నాలకు సంఘీభావం చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయకట్టు రైతులు విమర్శిస్తున్నారు.
దొంగే దొంగ అన్నట్టు!


