పింఛను బకాయిలు చెల్లించాలి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
అమలాపురం టౌన్: పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. స్థానిక గొల్లగూడెంలో శుక్రవారం జరిగిన జిల్లా పెన్షనర్ల సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీజీఈఏ విజయనగరం జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు పైడిరాజు, జిల్లా సంఘం అధ్యక్షుడు కె.మల్లిబాబు, తూర్పు గోదావరి జిల్లా సంఘం అధ్యక్షుడు గిరిప్రసాద్ వర్మ ప్రసంగించారు. పెన్షనర్లకు రావలసిన డీఏ బకాయిలు, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ తదితరాలతో పాటు గత పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పలు డిమాండ్లపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేధావి వర్గం నుంచి ప్రతిభావంతుడైన పెన్షనర్‌ను కో ఆప్షన్ సభ్యుడిగా లేదా ఆధార్ మెంబర్‌గా నియమించాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.


