రేషన్ బియ్యం స్వాధీనం
అంబాజీపేట: పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబాజీపేట ఎస్సై కె.చిరంజీవి కథనం ప్రకారం.. మామిడికుదురుకు చెందిన గోకవరపు రాఘవ అవినాష్ 82 బస్తాల్లో 2,988 కిలోల రేషన్ బియ్యాన్ని మామిడికుదురు నుంచి ఆలమూరుకు బొలెరో వాహనంలో తరలిస్తున్నారు. ముక్కామల వచ్చేసరికి పోలీసులు దాడి చేసి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఆలమూరు పరిసర ప్రాంతాల్లో పనులు చేసే కూలీలకు ఎక్కువ ధరకు విక్రయిస్తారని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బియ్యాన్ని ఎమ్‌ఎస్‌ఓ పూర్ణిమ సారధ్యంలో సివిల్ సప్లయిస్ గొడౌన్‌కు తరలించామన్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
నిడదవోలు: స్థానిక గణేష్‌చౌక్ సెంటర్‌లో గురువారం ఓ వృద్ధుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పంగిడి నుంచి విజ్జేశ్వరం వెళ్తున్న క్వారీ లారీ పట్టణంలో గణేష్‌చౌక్ సెంటర్‌లో మలుపు తిరుగుతున్న సమయంలో స్కూటీపై వెళుతున్న వృద్ధుడు దుప్పాడ రామారావును ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను లారీ కింద పడ్డాడు. లారీ టైర్లు అతనిపై ఎక్కకపోవడంతో స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. అతన్ని స్థానికులు బయటకు లాగి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లారీని స్టేషన్‌కు తరలించారు. అయితే కేసు నమోదు చేయలేదు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన వృద్ధుడి పేరు కూడా పోలీసులకు తెలియకపోవడం చర్చనీయాంశమైంది. పంగిడి, దేవరపల్లి ప్రాంతాల నుంచి క్వారీ లారీలు అడ్డూఅదుపు లేకుండా వేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుతున్నాయి. పోలీస్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు.
విద్యార్థి ఆత్మహత్య
కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం విజయనగరం రోడ్డులో ఉన్న డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ముడికి వికాస్ (16) తీవ్రమైన తలనొప్పిని భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ సీహెచ్ షణ్ముఖరావు కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాస్ ఇక్కడి డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. కొద్ది నెలలుగా అతను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తండ్రి సుబ్రహ్మణ్యంతో పాటు తోటి విద్యార్థులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం మరోమారు తలనొప్పి రావడంతో కళాశాల సిబ్బంది వికాస్ తండ్రికి ఫోన్‌లో సమాచారం అందించారు. ఇంటికి పంపించేస్తామని తెలిపారు. ఇప్పుడు బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, మరుసటి రోజు పంపించాలని కళాశాల సిబ్బందిని మృతుడి తండ్రిని కోరాడు. తోటి విద్యార్థులు డ్రిల్ కోసం మైదానంలోకి వెళ్లగా.. హాస్టల్ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు రూమ్‌కు వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కళాశాల సిబ్బంది సహాయంతో కిందకు దించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం
రేషన్ బియ్యం స్వాధీనం


