అంతర్వేది రథ శకలాల నిమజ్జనం వాయిదా
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో శనివారం నిర్వహించ తలపెట్టిన రథ శకలాల నిమజ్జనం వాయిదా పడింది. హిందూ ధార్మిక సంఘాలు, అంతర్వేది దేవస్థానం సంరక్షణ సమితి కోరిక మేరకు నిమజ్జనం వాయిదా వేసినట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాక్షికంగా కాలిన రథ శకలాలు నిమజ్జనం చేయకుండా వదిలేయడం ఈ ప్రాంతానికి అరిష్టమని, వెంటనే పోలీసుల నుంచి అనుమతి ఇప్పించాలని బీజేపీ నేత అయ్యాజీ వేమా గతంలో కోరారన్నారు. ఆ మేరకు పోలీసు అధికారులతో పలుమార్లు సంప్రదించగా దేవదాయ కమిషనర్ ఒక కమిటీని నియమించి, నిమజ్జనానికి ఉత్తర్వులిచ్చారన్నారు. అయితే అప్పటి నుంచి హిందూ ధార్మిక సంఘాలు, అంతర్వేది దేవస్థానం సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. సీబీఐ విచారణ తేలాలని, రఽథం దగ్ధం దోషులను కోర్టులో నిలబెట్టే వరకూ రథ శకలాలను నిమజ్జనం చేస్తే ఒప్పుకోమని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు వద్ద ఆందోళనలు చేసి వినతిపత్రాలు అందజేశారు.
ఏం జరిగిందంటే..!
అంతర్వేది ఆలయం వద్ద పాత రథం 2020 సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. ఈ ఘటనపై అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణం స్పందించి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పజెప్పారు. కొత్త రథం నిర్మాణానికి మొదటి విడతగా రూ.95 లక్షలు మంజూరు చేశారు. అనంతరం ఈ మొత్తాన్ని రూ.1.10 కోట్లకు పెంచారు. 2020 సెప్టెంబర్ 27న కొత్త రథం నిర్మాణాన్ని అప్పటి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, అప్పటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించారు. 2021 ఫిబ్రవరి 19న సీఎం హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రథాన్ని లాగి ప్రారంభించారు.


