ఎవరేమనుకుంటే మాకేంటి..
ఫ ప్రభుత్వ భవనంపై టీడీపీ ఫ్లెక్సీ
ఫ వివాదాస్పదంగా మారిన వైనం
రామచంద్రపురం రూరల్: ప్రభుత్వ భవనం.. దానిపై టీడీపీకి చెందిన నేతలు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ.. ఇవేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్న తీరు.. ఇదంతా రామచంద్రపురం రూరల్ మండలం వెల్లలో చోటు చేసుకుంది. ఆ గ్రామ సంతపేటలో డ్వాక్రా మహిళలకు చెందిన భవనాన్ని గతంలో నిర్మించారు. ఇదే భవనంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు సమావేశాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఇది ప్రభుత్వానికి చెందిన భవనం. దీనిపై ఎటువంటి ప్రైవేట్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయకూడదు. అలా ఏర్పాటు చేస్తే పంచాయతీ చట్టం ప్రకారం శిక్షార్హులు. కానీ టీడీపీకి చెందిన ఒక నేత దర్జాగా మంత్రి సుభాష్ ఉన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఈ ప్రభుత్వ భవనంపై ఏర్పాటు చేశారు. దీంతో వివాదాస్పదంగా మారింది. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఒక నేత ఇప్పటికే పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవటం గమనార్హం. దీనిపై పంచాయతీ కార్యదర్శి వి.సూర్య సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా ఇప్పటికే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారికి తీసివేయాలని చెప్పామని వివరణ ఇచ్చారు.


